- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌటుప్పల్‌లో నాళాను మింగేసిన ఘనులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్న మొండికుంట వరద కాలువను ఆక్రమణదారులు చెరబట్టారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్న మొండికుంట వరద కాలువను ఆక్రమణదారులు చెరబట్టారు. ఒకప్పుడు వర్షాకాలంలో భారీగా వరద నీటిని తరలించే ఈ కాలువ ప్రస్తుతం ఆక్రమణదారుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. అధికారులు సైతం అక్రమార్కులకు వంతపాడినట్టుగా, అభివృద్ధి పేరిట సుమారు 100 మీటర్ల పొడవున్న వరద కాలువను కేవలం 20 మీటర్లకు కుదిస్తూ కల్వర్టు నిర్మాణం చేపట్టడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలువ (నాళా)ను పూడ్చి అక్రమ కట్టడాలు చేపట్టడంతో వరద నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, భారీ వర్షాలు కురిస్తే వలిగొండ రోడ్డుతో పాటు సమీప కాలనీలు, వ్యాపార సముదాయాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు అక్రమం... ఇప్పుడు సక్రమమా?
2020 అక్టోబర్ 28న అప్పటి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశాల మేరకు, అప్పటి మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి ఆధ్వర్యంలో జేసీబీలతో ఇదే మొండికుంట కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అప్పట్లో ప్రకటించిన అధికారులు, ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పట్లో చట్టవిరుద్ధమైన నిర్మాణాలు నేడు ఏ నిబంధనల ప్రకారం చట్టబద్ధమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
200 గజాలకు అనుమతి... 500 గజాల్లో నిర్మాణం !
స్థానికుల ఆరోపణల ప్రకారం, మున్సిపాలిటీ కేవలం 200 చదరపు గజాలకు మాత్రమే అనుమతి ఇచ్చినా, కాలువను పూడ్చి సుమారు 500 చదరపు గజాల మేర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల మౌనం... రాజకీయ అండే కారణమా ?
మొండికుంట కాలువను పూడ్చి ఆక్రమణలు బహిరంగంగా జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆశీస్సులు, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ముంపు ముప్పు తప్పదా ?
వరద కాలువను కుదించడం వల్ల వర్షపు నీరు సజావుగా వెళ్లే అవకాశం తగ్గిపోతుందని, భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే చౌటుప్పల్ పట్టణంలోని పలు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ కాలువ వరద నీటి ప్రవాహానికి కీలకంగా ఉపయోగపడిందని గుర్తు చేస్తున్నారు.
విచారణ జరిపి అసలు స్వరూపం పునరుద్ధరించాలి..
మొండికుంట కాలువ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి కాలువ అసలు స్వరూపాన్ని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూల్చివేసిన నిర్మాణాలకు ఇప్పుడు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఏ నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేశారు. అనే అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






