దేశభక్తి నినాదం కాదు.. త్యాగంలోనే కనిపిస్తుంది: కేంద్ర మంత్రి బండి సంజయ్

by Malleboina Mahesh |

శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తోంది.. ఆర్టికల్ 370 రద్దు ఆయన కన్న కల అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్!

దేశభక్తి నినాదం కాదు.. త్యాగంలోనే కనిపిస్తుంది: కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దేశం కోసం మాట్లాడిన వారు ఎందరో ఉన్నారు. దేశం కోసం ప్రాణం ఇచ్చిన వారు చాలా కొద్ది మంది ఉంటారు. అందులో శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. దేశం కోసం బలిదానం చేసిన మహనీయుల త్యాగాన్ని మరచిపోయిన జాతి తన భవిష్యత్తును కూడా కోల్పోతుందనే విషయాన్ని గుర్తు చేశారు. శ్యామా ప్రసాద్ ఆశయాలను, ఆకాంక్షలను నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నితిన్ నబిన్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తూ.చ తప్పకుండా అమలు చేస్తోందని తెలిపారు. భారత్ కు అణ్వస్త్రాలను సమకూర్చడం, 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేయడంతోపాటు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమలుతో స్వయం సమృద్ధి దేశంగా భారత్ ను తీర్చిదిద్దుతుండటమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్యామా ప్రసాద్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్దంగా ఉండాలని జన సంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్ పై యుద్దం చేయడానికి పంపిన వీరుడు. పార్టీ, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనే. కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ నహీ ఛలేగా...నహీ ఛలేగా’ అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ.

ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కాశ్మీర్ బయలుదేరిన శ్యామా ప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురి చేసింది. ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించాలని సోయి లేకుండా వెళ్లిపోయారు. ఆ నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ ది. ఆయన చనిపోయాక కాశ్మీర్ కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది బీజేపీ సాధించిన తొలి విజయం’ అని బండి సంజయ్ గుర్తుచేశారు.ఆ మహనీయుడి ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ తూ.చ తప్పకుండా అమలు చేస్తోందన్నారు.

ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్ పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే... 370 ఆర్టికల్ ను రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారని తెలిపారు. దేశ స్వావలంబన కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరితపిస్తే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతో దేశం స్వయం సమృద్ది సాధించేలా ఆచరణలోకి తీసుకొచ్చిన గొప్ప నేత నరేంద్ర మోడీ అని అన్నారు. దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి తిరిగి మాత్రుభూమికి వచ్చిన వారికి అండగా ఉండేందుకు పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ దేనని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ప్రభుత్వమని, శ్యామా ప్రసాద్ ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అని అన్నారు.

Next Story