- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్-రియాద్ మధ్య రోజువారీ విమాన సర్వీసులు
హైదరాబాద్ - రియాద్ మధ్య రోజువారీ విమాన సర్వీసులు ప్రారంభించిన సౌదీ బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘ఫ్లైదీల్’.. ప్రవాస భారతీయులకు భారీ లబ్ధి!

దిశ, తెలంగాణ బ్యూరో: సౌదీ అరేబియాకు చెందిన తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైదీల్ భారతీయ విమానయాన మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. హైదరాబాద్-రియాద్ మధ్య రోజువారీ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా తొలి విమానానికి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఘన స్వాగతం పలికింది. సౌదియా గ్రూప్‌నకు చెందిన వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్లైదీల్ సంస్థ ఎయిర్‌బస్ ఎ320 విమానాలతో రియాద్–హైదరాబాద్–రియాద్ మార్గంలో ప్రతిరోజూ సర్వీసులను నడపనుంది. ఈ సర్వీస్‌తో హైదరాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా మరింత బలోపేతం కావడంతోపాటు భారత్-సౌదీ అరేబియా మధ్య వైమానికం మరింత విస్తరించనుంది.
సోమవారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ కదిర్ కదిరవన్, సంస్థ సీనియర్ అధికారులు, ఫ్లై దిల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లాయిడ్ జో మిస్క్విట్టా, హెడ్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ అబ్దుల్‌రహ్మాన్ అల్‌రషీద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ కదిర్ కదిరవన్ మాట్లాడుతూ భారతీయ మార్కెట్‌లో తొలి అడుగు వేస్తున్న ఫ్లైదీల్‌కు హైదరాబాద్‌లో స్వాగతం పలకడం ఆనందంగా ఉన్నదన్నారు. రియాద్‌కు కొత్త నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం కావడం వల్ల మధ్యప్రాచ్య దేశాలతో హైదరాబాద్‌కు ఉన్న అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
ఈ సర్వీస్ ద్వారా ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతోపాటు ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయంగా 76 గమ్యస్థానాలు, అంతర్జాతీయంగా 24 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తున్నది. ఫ్లైదీల్ చేరికతో సౌదీ అరేబియాకు ప్రయాణించే వారికి మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్లైదీల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లాయిడ్ మిస్క్విట్టా మాట్లాడుతూ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తూ హైదరాబాద్‌కు తొలి సర్వీస్‌ను ప్రారంభించడం తమ సంస్థకు కీలక మైలురాయిగా అభివర్ణించారు.






