- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదనపు కట్నం కోసం వివాహితపై వేధింపులు
అదనపు కట్నం కోసం ఓ వివాహితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి గెంటేసిన భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, గోపాల్ పేట: అదనపు కట్నం కోసం ఓ వివాహితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి గెంటేసిన భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..వనపర్తి జిల్లా ఏదుల మండలం చెన్నారం గ్రామానికి చెందిన పల్లవికి నాలుగేళ్ల క్రితం గోపాల్ పేట మండలం, పోలికే పాడు గ్రామం శివకుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పల్లవి తల్లిదండ్రులు రూ.2 లక్షల నగదు, రెండు తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. పెళ్లి అనంతరం రెండేళ్ల పాటు దంపతులు హైదరాబాద్‌తో పాటు స్వగ్రామంలో సజావుగా కాపురం సాగించారు.
అయితే గత రెండేళ్లుగా భర్త శివకుమార్, అత్త లక్ష్మి, మామ చిన్నయ్యలు అదనపు కట్నం తీసుకురావాలని పల్లవిపై ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి నిర్మించిన ఇంటిని భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని తెలిపింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించి రాజీ కుదర్చేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొంది.
ఈ నెల 1వ తేదీన భర్త, అత్త, మామ ముగ్గురూ కలిసి తనపై దాడి చేసి చేతులతో కొట్టారని, ఇంటిని భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసే వరకు ఇంట్లోకి రావద్దంటూ బలవంతంగా బయటకు నెట్టివేశారని బాధితురాలు ఆరోపించింది. అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన భర్త శివకుమార్, అత్త లక్ష్మి, మామ చిన్నయ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






