Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరో విడత ఉద్యోగాల కోత

by S Gopi |

ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో వ్యయ నియంత్రణ, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరో విడత ఉద్యోగాల కోత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై భారీ పెట్టుబడులు పెడుతూ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల కోతలకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం, అంటే దాదాపు 4,800 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో వ్యయ నియంత్రణ, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా వేలాది ఉద్యోగులను తొలగించగా, అదే జాబితాలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కంపెనీ షేరు ధర దాదాపు 23 శాతం పడిపోవడం, కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందు ఖర్చులను పునర్వ్యవస్థీకరించడం కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని సుమారు 9,000 మంది ఉద్యోగులకు కంపెనీ స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కూడా కల్పించింది. మరోవైపు అజూర్ క్లౌడ్ సేవలకు ఏఐ డిమాండ్ బలంగా ఉండటంతో వ్యాపార వృద్ధి కొనసాగుతోంది. కానీ ఏఐ సేవలకు అవసరమైన డేటా సెంటర్ల నిర్మాణం, అధిక సామర్థ్య చిప్‌ల కొనుగోలు వంటి ఖర్చులు కంపెనీపై ఒత్తిడిని పెంచుతున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది.

Next Story