కాస్మోసర్వ్ స్పేస్‌ నుంచి మిషన్ ఎంబ్రేస్

by Malleboina Mahesh |

స్పేస్ స్టార్టప్ కాస్మోసర్వ్ ‘మిషన్ ఎంబ్రేస్’ ప్రకటన.. స్కైరూట్ ‘విక్రమ్-1’ రాకెట్ ద్వారా జూలై 12 - ఆగస్టు 4 మధ్య అంతరిక్షంలోకి ప్రయోగం!

కాస్మోసర్వ్ స్పేస్‌ నుంచి మిషన్ ఎంబ్రేస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ స్పేస్ స్టార్టప్ కాస్మోసర్వ్ స్పేస్ తన తొలి కక్ష్య సాంకేతిక ప్రదర్శన మిషన్ ఎంబ్రేస్‌ను ప్రకటించింది. ఈ మిషన్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రం-1 తొలి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం మిషన్ ఆగమన్‌లో భాగంగా ప్రయాణించనుంది. ఈ ప్రయోగానికి జూలై 12 నుంచి ఆగస్టు 4, 2026 మధ్య ప్రయోగ విండోకు అనుమతి లభించింది. అంతరిక్షంలో పనిచేయకుండా నిలిచిపోయిన ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకునేందుకు రూపొందించిన సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ టెక్నాలజీని కక్ష్యలో తొలిసారిగా ప్రదర్శించడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ సాంకేతికత విజయవంతమైతే, భవిష్యత్తులో అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కార్యక్రమాలకు కీలకంగా ఉపయోగపడనుంది.

భూమి చుట్టూ వేల సంఖ్యలో పనిచేయని ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలు పేరుకుపోతుండటంతో, వాటి తొలగింపు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలక సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కాస్మోసర్వ్ స్పేస్ తక్కువ వ్యయంతో పనిచేయగల రోబోటిక్ సర్వీసర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది పనికిరాని ఉపగ్రహాలను గుర్తించి, సురక్షితంగా పట్టుకుని కక్ష్య నుంచి తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ అభివృద్ధి చేసిన సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ వ్యవస్థను కేవలం నాలుగు నెలల్లోనే కాన్సెప్ట్ దశ నుంచి ఫ్లైట్‌కు సిద్ధమైన హార్డ్‌వేర్‌గా తీర్చిదిద్దడం విశేషం. ఏడాది కూడా పూర్తి కాకముందే కంపెనీ తన సాంకేతికతను అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం చేయడం భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సాంకేతికత అభివృద్ధి మొత్తం మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీ పర్యవేక్షణలో జరిగింది.

సిస్టమ్ కాన్సెప్ట్ రివ్యూ, ప్రిలిమినరీ డిజైన్ రివ్యూ, క్రిటికల్ డిజైన్ రివ్యూ, ఫ్లైట్ రెడీనెస్ రివ్యూ వంటి అన్ని కీలక దశలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం దీనికి ప్రయోగ అనుమతి లభించింది. ఈ సందర్భంగా కాస్మోసర్వ్ స్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర మాట్లాడుతూ మిషన్ ఎంబ్రేస్ తమ సంస్థకే కాకుండా భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కూడా ఒక కీలక మైలురాయి లాంటిదన్నారు. కేవలం నాలుగు నెలల్లో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసి అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం చేయగలిగామని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్‌తో కలిసి ఈ మిషన్ ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు అవసరమైన కీలక సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్, ఇన్-ఆర్బిట్ సర్వీసింగ్, ఇన్-ఆర్బిట్ రీఫ్యూయెలింగ్ వంటి రంగాల్లో విస్తృత సేవలను అందించడమే తమ లక్ష్యమని కాస్మోసర్వ్ స్పేస్ వెల్లడించింది.

Next Story