- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపాటు
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు.. ఎంఐఎం అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ వివక్ష చూపుతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు!

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ నాటకం తప్ప మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ‘ఏక్ దేశ్.. ఏక్ విధాన్.. ఏక్ ప్రధాన్’ అనే మహోన్నత సంకల్పంతో అఖండ భారత సాధన కోసం జీవితాంతం కృషి చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జియో టెక్నికల్ రిపోర్టులు, ఇతర సాంకేతిక పరీక్షల ద్వారా డ్యాం సేఫ్టీ చర్యల్లేవని ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)’ స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రిపేర్ పనులు ప్రారంభించకపోవడం వారి ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఒక ‘ఏటీఎం’లా మార్చుకుని, కేవలం డబ్బు, అహంకారంతోనే తరతరాలుగా రాజకీయం చేయొచ్చని భావించిందని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిని పూర్తిగా మర్చిపోయారని, అక్కడ జరిగిన అవినీతిపై ఎలాంటి కఠిన చర్యలు లేకుండా, కేవలం కొందరు అధికారులపై నామమాత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ఉన్న ఈ హఠాత్తు 'మమకారం' వెనుక రహస్యం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని, ఇరు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో 'హైడ్రా' వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలో హైడ్రా పేరుతో పేదవాళ్ల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం.. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎంకు సంబంధించిన 'ఫాతిమా విద్యాసంస్థల విషయంలో స్పష్టంగా నిబంధనలను ఉల్లంఘించిందని, అదేవిధంగా స్వయంగా విద్యాశాఖ కూడా అనుమతులే లేవని కోర్టుకు తెలపడాన్ని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా హైకోర్టు సైతం తప్పుపట్టిందని గుర్తుచేశారు. స్వయంగా హైడ్రా కూడా ఇది ఆక్రమణే అని అంగీకరించినప్పటికీ, అంత స్పష్టంగా కనబడుతున్న ఆ స్కూల్‌ను, భవనాలను ఎందుకు కూల్చివేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎంతో ఉన్న దోస్తానా వల్లే ఈ వివక్ష చూపుతున్నారని, హైడ్రా అంటే కేవలం పేదవాళ్ల ఇళ్లను కూల్చడానికే ఉందా అని దుయ్యబట్టారు.
ఎంఐఎం అన్ని రూల్స్ ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టడాలు కడితే హైడ్రా పర్మిషన్లు ఇస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలని, పేదవాళ్లకు ఒక న్యాయం, ఎంఐఎంకు ఒక న్యాయం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎంఐఎంకు చెందిన అక్రమ ఇన్‌స్టిట్యూషన్స్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం, హైడ్రా పక్షపాత వైఖరిపై భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తుందని రాంచందర్ రావు హెచ్చరించారు.






