సిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఆధ్యాత్మిక శోభ

by Malleboina Mahesh |

సిర్సనగండ్లలో రేపటి నుంచే సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు! ఏడు రోజుల పాటు వైభవంగా వేడుకలు.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు పూర్తి.

సిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఆధ్యాత్మిక శోభ
X

దిశ, చారకొండ : తెలంగాణ రాష్ట్రంలో ‘రెండవ భద్రాద్రి’గా ప్రసిద్ధి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుకల కోసం ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అయోధ్య నగర్ గుట్టపై 70 ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భద్రాచలం తరహాలోనే ఇక్కడ కూడా సీతారాముల కల్యాణాన్ని ప్రభుత్వ లాంఛనాలతో కన్నుల పండువగా నిర్వహిస్తారు.

శతాబ్దాల చరిత్ర.. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం

చారిత్రక పరిశోధకుల ప్రకారం ఈ ఆలయం 14వ శతాబ్దంలో నిర్మితమైంది. భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహాలు సకాలంలో చేరక రావిచేడులో భూస్థాపితం కాగా, స్థానిక భక్తుడు ఢేరం రామయజ్వీకి శ్రీరాముడు స్వప్నంలో కనిపించి ఈ గుట్టపై ప్రతిష్ఠించమని ఆదేశించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ అష్టమి నుండి చైత్ర శుద్ధ చతుర్దశి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, విద్యుత్, చలువ పందిళ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో రూ.2కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రక్రియ కూడా పూర్తయింది. భక్తుల రాకపోకల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు..

ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న మాస కళ్యాణం, ధ్వజారోహణం, ఎదుర్కోలు, పల్లకీ సేవ నిర్వహిస్తారు. 27న మహా కల్యాణోత్సవం, హనుమత్ సేవ, 28న చిన్న రథోత్సవం (పూల రథం), 29న గరుడ సేవ జరగనున్నాయి. 30న ప్రధాన ఘట్టమైన పెద్ద రథోత్సవం (బ్రహ్మోత్సవం), 31న గజ సేవ, దీపోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న చక్రతీర్థం, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజూ భజనలు, సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Next Story