‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

by Batti.Sumithra |

తెలంగాణలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : తెలంగాణలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మడికొండలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ పై ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది వంటిదని, ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని ఆ హక్కును పరిరక్షించుకోవాలని అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన కోసం ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. గ్రామంలోని బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అందజేయడంతో పాటు వాటిని సక్రమంగా నింపడంలో సహకరించాలని, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చిరునామా మార్పులు వంటి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు, స్వయంగా ఫారమ్‌లు నింపలేని వారికి ప్రత్యేక సహకారం అందించి, ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని సూచించారు. అలాగే బూత్ లెవల్ ఏజెంట్లు బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాలోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎంతో ముఖ్యమని అన్నారు.

ఓటర్లకు ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉండాలని, ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తన వివరాలను ధృవీకరించుకోవాలని పిలుపునిచ్చారు. చనిపోయిన వారి పేర్లను, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను గుర్తించి, వాటిని నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా చొరవ చూపాలని సూచించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించడంలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ పని తీరును నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రు పాషా, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, పార్లమెంట్ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీనివాస్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవళి రెడ్డి, హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story