- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల బీఎల్‌వోలకు ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఎల్‌వోలకు, వరంగల్ ఐఎంఏ హాల్‌లో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఎల్‌వోలకు, నర్సంపేట బాలాజీ ఇంజినీరింగ్ కళాశాలలో నర్సంపేట నియోజకవర్గ బీఎల్‌వోలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఇంకా మిగిలి ఉన్న ఫారాలను త్వరితగతిన పంపిణీ చేయాలని సూచించారు. పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సంబంధిత ఓటర్లకు రెండు ఫారాలు అందజేస్తారని తెలిపారు. అందించిన ఫారాల్లో ఓటరు వివరాలను నమోదు చేసే ప్రక్రియలో గ్రామాలు, కాలనీల్లోని విద్యావంతులు, యువత, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో సహకరించాలని కోరారు. దీనివల్ల ఓటరు జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ సులభతరంగా పూర్తవుతుందని తెలిపారు. ఓటరు వివరాలు పూరించిన రెండు ఫారాల్లో ఒక ఫారాన్ని బీఎల్‌వోలకు అందజేస్తే, అందులోని వివరాలను యాప్‌లో నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. సర్వే నిర్వహించే సమయంలో ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించి, అవసరమైన ధ్రువీకరణ అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, అవసరమైన పత్రాల ధ్రువీకరణ, ఆన్‌లైన్ నమోదు విధానం, ఫీల్డ్ స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు వివరించారు. బీఎల్‌వోల సందేహాలను నివృత్తి చేస్తూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.






