తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం.. జిల్లా ఆటగాళ్లకు TG20 భారీ అవకాశం

by Batti.Sumithra |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ TG20 టోర్నమెంట్ తెలంగాణలోని గ్రాస్‌రూట్ క్రికెట్ అభివృద్ధికి బలమైన వేదికగా నిలుస్తోందని జిల్లా క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం.. జిల్లా ఆటగాళ్లకు TG20 భారీ అవకాశం
X

దిశ, ఉప్పల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ TG20 టోర్నమెంట్ తెలంగాణలోని గ్రాస్‌రూట్ క్రికెట్ అభివృద్ధికి బలమైన వేదికగా నిలుస్తోందని జిల్లా క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఆదివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక మీడియా ఇంటరాక్షన్‌లో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో లీగ్‌లోని మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన జిల్లా క్రికెటర్లు పాల్గొన్నారు. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో జిల్లా ఆటగాళ్లను తప్పనిసరిగా చేర్చుకోవాల్సి ఉండటంతో, ఈ టోర్నమెంట్ వారికి స్థిరపడిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం కల్పించింది. అలాగే తెలంగాణలోని ప్రముఖ క్రికెట్ వేదికలలో ఒకటైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలిచింది.

హైదరాబాద్ ఈ-చాంపియన్స్ తరఫున ఆడుతున్న ఆల్‌రౌండర్ గణేష్ గడుగు, ఆరు మ్యాచ్‌లలో 212 పరుగులతో అత్యుత్తమ జిల్లా ప్రదర్శనకారుల్లో ఒకరిగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జిల్లా క్రికెటర్లుగా మేము రాష్ట్రంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి పోటీ పడుతున్నాం. ఇలాంటి వేదిక కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. TG20 మాకు మా ప్రతిభను నిరూపించుకునే అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ వేదికను అందించిన నిర్వాహకులకు ధన్యవాదాలు,” అని అన్నారు. ఖమ్మం ఏసీఈఎస్ బ్యాటర్ జి. సాయికృష్ణా రెడ్డి ఈ టోర్నమెంట్‌లో అత్యంత స్థిరంగా రాణిస్తున్న జిల్లా బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 43.00 సగటుతో 172 పరుగులు, అందులో అజేయ 56 పరుగులు, అలాగే 163.81 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు TG20 నిజంగా పెద్ద వేదిక. అనుభవజ్ఞులైన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లతో కలిసి ఆడటం, వారి ముందు ప్రదర్శన చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇలాంటి వేదికల పై నిలకడగా రాణిస్తే, మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.

పాలమూరు స్ట్రైకర్స్ బౌలర్ మహ్మద్ అఫ్రీది అహ్మద్, ఐదు మ్యాచ్‌లలో రెండు వికెట్లు సాధించి, 8.06 ఎకానమీ రేట్ నమోదు చేశాడు. ఈ లీగ్ తన ఆటను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. “TG20 ద్వారా నేను ఎంతో అనుభవం సొంతం చేసుకుంటున్నాను. ఫీల్డింగ్, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం, మొత్తం ఆటను మెరుగుపరచుకోవడం వంటి అనేక విషయాల్లో ప్రతిరోజూ నేర్చుకుంటున్నాను. మాలాంటి జిల్లా ఆటగాళ్లకు ఇది గొప్ప వేదిక,” అని తెలిపారు. రంగారెడ్డి రైజర్స్ ఫాస్ట్ బౌలర్ టి.అరుణ్ కుమార్, ఆరు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు సాధించాడు. గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్ తరఫున రాష్ట్ర క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా నిలిచిన ఆయన మాట్లాడుతూ, TG20 జిల్లా ఆటగాళ్లకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎక్స్‌పోజర్‌ను అందించిందన్నారు. “జిల్లా క్రీడాకారులకు ఈ లీగ్ ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం.

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి లీగ్‌లు ఉన్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణకు కూడా ఆ అవకాశం లభించింది. TG20 మాకు మునుపెన్నడూ లేని ఎక్స్‌పోజర్ ఇచ్చింది,” అని పేర్కొన్నారు. ఈ ఐపీఏల్ (EIPL), ఎలివ్ కరీంనగర్ డైమండ్స్ ఆల్‌రౌండర్ TVS నారాయణ తేజ ఐదు ఇన్నింగ్స్‌లలో 130.91 స్ట్రైక్ రేట్‌తో 72 పరుగులు చేసి, అందులో అత్యుత్తమంగా 45 పరుగులు నమోదు చేశాడు. అదనంగా ఆరు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు కూడా తీశాడు. ఈ టోర్నమెంట్ జిల్లా క్రికెటర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆయన అన్నారు. “ఇది నిజంగా గొప్ప అనుభవం. ఇక్కడ మనల్ని మనం నిరూపించుకుంటే, ఉన్నత స్థాయిలో పోటీ చేయడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇంత పెద్ద టోర్నమెంట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది,” అని చెప్పారు. శ్రీనిధి యూనివర్సిటీ TG20 కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాకుండా, తెలంగాణ జిల్లాల ప్రతిభకు ఒక లాంచ్‌ప్యాడ్, ఒక అవకాశ వేదిక, ఒక భవిష్యత్‌కు మార్గదర్శిగా నిలుస్తోందని జిల్లా క్రీడాకారులు తెలిపారు.

Next Story