- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో సైలెంట్‌గా పెరుగుతున్న 'ఫ్యాటీ లివర్' మహమ్మారి
భారత దేశంలో 'ఫ్యాటీ లివర్' చాపకింద నీరులా సైలెంట్‌గా పెరుగుతుంది. గతంలో కాలేయం (లివర్) దెబ్బతిన్నదంటే.. సదరు వ్యక్తికి విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉండి ఉంటుందని అందరూ భావించేవారు.

దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలో 'ఫ్యాటీ లివర్' చాపకింద నీరులా సైలెంట్‌గా పెరుగుతుంది. గతంలో కాలేయం (లివర్) దెబ్బతిన్నదంటే.. సదరు వ్యక్తికి విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉండి ఉంటుందని అందరూ భావించేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. అసలు మద్యం వాసన కూడా చూడని వారిలో, కనీసం 20 ఏళ్ల యువతలో కూడా కాలేయం చెడిపోతుంది. దీనికి కారణం 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' (NAFLD). భారతదేశంలో ఇది ఒక నిశ్శబ్ద హంతకిలా (Silent Killer) మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనకు ఎంత దరిదాపుల్లో ఉందంటే?
భారత్ లో గత కొద్ది రోజులుగా ఈ ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, భారత జనాభాలో దాదాపు 30% నుంచి 35% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరి లివర్‌లో కొవ్వు పేరుకుపోయింది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. కాలేయం 80 శాతం దెబ్బతినే వరకు ఎలాంటి నొప్పి గానీ, బయటకు కనిపించే లక్షణాలు గానీ ఉండవు. అలసట, కడుపు పై భాగంలో అసౌకర్యం వంటి సాధారణ లక్షణాలే ఉండటంతో చాలామంది దీనిని పట్టించుకోరు. చివరికి అది లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ గా మారినప్పుడు మాత్రమే అసలు విషయం బయటపడుతుంది.
ముప్పుకు ప్రధాన కారణాలు
తప్పుడు ఆహారపు అలవాట్లు మనను ఈ ఫ్యాటీ లివర్ మహమ్మారి బారిన పడేటట్లు చేస్తుంది. మనం తీసుకునే జంక్ ఫుడ్, మైదా, పంచదార అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ నేరుగా లివర్‌పై కొవ్వుగా మారుతున్నాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు ఖర్చు కాక కాలేయంలో నిల్వ ఉంటున్నాయి. పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నవారికి 'ఫ్యాటీ లివర్' వచ్చే అవకాశం 90 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగుల్లో కాలేయం త్వరగా విషతుల్యంగా మారుతోంది.
అప్రమత్తంగా ఉండి..ఈ చర్యలు తీసుకుంటే మేలు..
సైలెంట్ కిల్లర్ అయిన ఫ్యాటీ లివర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే సులభంగా రివర్స్ (మళ్ళీ సాధారణ స్థితికి తీసుకరావడం) చేయవచ్చు. దీనికోసం వైద్యులు ఈ క్రింది జాగ్రత్తలు సూచిస్తున్నారు.
* మీ బరువులో కేవలం 7-10 శాతం తగ్గినా కాలేయంలోని కొవ్వు కరిగిపోతుంది.
* అన్నం, రోటీ వంటి కార్బోహైడ్రేట్లు తగ్గించి.. ప్రోటీన్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు పెంచాలి.
* రోజుకు 30 నిమిషాల వేగవంతమైన నడక, ఏరోబిక్ వ్యాయామం కాలేయానికి ప్రాణవాయువు లాంటివి.
* ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లు, సోడాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
*వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడకూడదు, అవి కాలేయంపై ప్రభావం చూపుతాయి.
తినకూడని ఆహారాలు పదార్థాలు
* చక్కెర: స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు పూర్తిగా మానేయాలి.
* మైదా: బిస్కెట్స్, వైట్ బ్రెడ్, పిజ్జా వంటివి కాలేయానికి శత్రువులు.
* అధిక ఉప్పు: రక్తపోటును పెంచి కాలేయంపై ఒత్తిడి కలిగిస్తుంది.
* వేపుళ్లు (Fried Foods): నూనెలో వేయించిన పదార్థాలు కొవ్వును పెంచుతాయి.






