ఏపీ కొత్త మంత్రులు వీరే.. మహిళా మంత్రులంతా ఔట్?

by Disha Web Desk 2 |
ఏపీ కొత్త మంత్రులు వీరే.. మహిళా మంత్రులంతా ఔట్?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈనెల 27న మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఉగాది నాడు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో ఉండేదెవరు..? ఊడెదెవరు అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంతేకాదు కొంతమంది పాతమంత్రులకు అవకాశం కూడా సీఎం జగన్ కల్పించడంతో ఎవరు కొనసాగబోతున్నారనేదానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ఎవరు సేఫ్ అనేదానిపై వారిలో వారే చర్చించుకుంటుంటే... ఏ జిల్లా నుంచి ఎంతమందిని తీసుకోబోతున్నారు..? ఏయే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు? గతంలో మాదిరిగానే ఐదుగురు డిప్యూటీ సీఎంలే ఉంటారా..? మహిళకే హోంశాఖ ఇస్తారా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభిస్తున్న తరుణంలో 26 జిల్లాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కూడికలు తీసివేతలపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కేబినెట్ విస్తరణే అత్యంత హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

జిల్లా నుంచి ఒక్కొక్కిరికీ ప్రాతినిథ్యం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నట్లుగానే మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 27న మంత్రులు రాజీనామా చేయనున్నారు. మంత్రులుగా తప్పించిన వారికి పార్టీ జిల్లా అధ్యక్షులుగా ,రీజనల్ కో-ఆర్డినేటర్‌లుగా పార్టీ బాధ్యతలు అప్పగించనున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో మాదిరిగానే బీసీ - ఎస్సీ - మైనార్టీ కోటాలో అదే సంఖ్యలో మంత్రులు కేబినెట్‌లో కొనసాగుతారు. తిరిగి మహిళకే హోం మంత్రిగా అవకాశం దక్కనుంది. అలాగే అయిదు సామాజిక వర్గాల నుంచి అయిదుగురు డిప్యూటీ సీఎంలు సైతం ఉండనున్నారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతీ జిల్లా నుంచి ఒక్కొక్కరికి ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు మాత్రం సేఫ్ అని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ,కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ,కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని, విజయనగరం నుండి బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులు సేఫ్ అని తెలుస్తోంది. మిగిలిన వారంతా ఔట్ అని సమాచారం.

రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదుగురికి ఛాన్స్

జగన్ కేబినెట్‌లో బెర్త్‌లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి కేబినెట్‌లో బెర్త్ ఆశిస్తున్న వారిలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో ప్రకాశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంలోనూ ప్రకాశ్ రెడ్డి ముఖ్యభూమిక పోషించారు. ఈ అంశాలు ప్రకాశ్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే అదే జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఇకపోతే కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌లు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా రేసులో మెుదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతతి స్థానంలో భూమన కరుణాకర్‌ రెడ్డిలు ఉన్నారు. ఈసారి రోజాకు మంత్రి పదవి ఖాయమని.. హోంశాఖ కూడా ఆమెకేనంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఈసారి మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఇకపోతే కేబినెట్‌లో రెడ్డి సామాజికవర్గానికి ప్రస్తుతం మాదిరిగానే నలుగురికి లేదా ఐదుగురికి ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది.

ముస్తఫాకు చాన్స్?

ఇక మైనారిటీల విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంజాద్‌ భాష ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి ఆయనను పదవి నుంచి తప్పించడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఆ స్థానం కోసం కర్నూలు సిటీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌ బాష పోటీ పడుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గం నుంచి ప్రాతినిథ్యవ వహించే వారి సంఖ్య మూడుకు చేరుకోవడంతో మైనారిటీ కోటాలో నవాజ్‌ బాషకు చాన్స్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ అయిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మాజీ పోలీస్ అధికారి, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌సైతం కేబినెట్‌లో బెర్త్ ఆశిస్తున్నారు.

కొడాలి నాని సేఫ్?

కమ్మ సామాజికవర్గం నుంచి కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్‌రావు, అన్నాబత్తుని శివకుమార్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే కేబినెట్‌ నుంచి కొడాలి నానిని తప్పించే చాన్స్ లేవని తెలుస్తోంది. సామాజికవర్గ సమీకరణాలతోపాటు, టీడీపీని గట్గిగా ఎదుర్కొనే నానిని కొనసాగించాలని సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ రాజకీయ నేపథ్యం కేబినెట్‌లో చోటు కోసం గట్టిగానే శ్రమిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాపు సామాజిక వర్గం నుంచి ఆ నలుగురు

కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య చాంతాడంత ఉంది. ఉభయ గోదావరి జిల్లాలలో అత్యధిక నియోజకవర్గాలను ప్రభావితం చేసే సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటి. దీంతో కేబినెట్‌లో తీసుకునే కాపు సామాజిక వర్గానికి చెందిన వారి కోసం సీఎం జగన్ గట్టిగానే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాపు సామాజికవర్గం నుంచి పేర్ని, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు మంత్రులుగా ఉన్నారు. వీరందరినీ మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి కురసాల కన్నబాబు స్థానంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. దాడిశెట్టి రాజాతోపాటు జక్కంపూడి రాజా కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరితోపాటు విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్‌నాథ్, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు, కృష్ణా జిల్లాకు నుంచి సామినేని ఉదయభానులు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాయలసీమలోని బలిజలకు చాన్స్ ఇవ్వాలనే యోచన వస్తే పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య పేరును పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీసీ సామాజిక వర్గం నుంచి భారీ పోటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బీసీ ఓటు బ్యాంకు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకే అగ్రస్థానం కల్పిస్తున్నారు. బీసీలను అన్ని పదవుల్లో చోటు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు పదవి ఇచ్చే అంశంపై సీఎం జగన్ పెద్ద ఎక్సర్‌సైజ్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో అవకాశం దక్కిన సామాజికవర్గాలకు కాకుండా మిగిలిన బీసీ సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీల్లో రాయలసీమ నుంచి జయరాములు (బోయ), శంకర నారాయణ (కురబ)లకు అవకాశం ఇచ్చారు. అలాగే కర్నూలు మేయర్‌గా బోయ సామాజికవర్గానికి చెందిన బీవై రామయ్య, అనంతపురం జెడ్పీ చైర్మన్‌ పదవి గిరిజమ్మ(బోయ)కు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీసీ సామాజిక వర్గంలోని పెద్ద కులాలకు ఈసారి ప్రాతినిథ్యం కల్పించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. శెట్టిబలిజ, తూర్పుకాపులకు మళ్లీ అవకాశం దక్కే సూచనలున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జిల్లాకు చెందిన సీనియర్‌ నేత బీద మస్తాన్‌ రావుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యాదవ్ సామాజిక వర్గానికి ఈసారి బెర్త్ డౌటేనని తెలుస్తోంది. వీరి కాకుండా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ, సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావులు బీసీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే శెట్టిబలిజ సామాజికవర్గానికి రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణను మంత్రిగా కొనసాగించే అవకాశం ఉంది. శెట్టిబలిజల్లో వేణు ఒక్కరే ఉండడం అయనకు కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. మత్య్సకార సామాజికవర్గం నుంచి సీదిరి అప్పల రాజును కొనసాగించే అవకాశాల కనిపిస్తున్నాయి. విద్యావంతుడు, విపక్షాలపై ఎదురుదాడి, ప్రభుత్వ వాయిస్‌ను బలంగా వినిపిస్తుండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు కావడం విశేషం. ఇదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ రేసులో ఉన్నప్పటికీ కోనసీమ జిల్లానుంచి ఎస్సీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సతీష్‌కు మంత్రి పదవి కష్టమేనని తెలుస్తోంది.

ఎస్సీ సామాజిక వర్గంలో తర్జనభర్జన

ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం నారాయణ స్వామి, పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, తానేటి వనితలు కేబినెట్‌లో కొనసాగుతున్నారు. వీరందరినీ మార్చి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని సీఎం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు రేసులో ఉన్నారు. వీరితోపాటు విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు సైతం నేనున్నాంటూ రేసులో ఉన్నారు. గొల్ల బాబూరావు వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ కోటాలో ఈసారి గొల్ల బాబూరావుకు కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేన్‌ రాజుకు మండలి చైర్మన్‌ పదవి ఇచ్చిన నేపథ్యంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటే పినిపే విశ్వరూప్‌ను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి మొండితోక జగన్‌మోహన్‌ రావు రేసులో ఉండగా ఆయన సోదరుడు మొండితోక అరుణ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయనకు నో చాన్స్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, కర్నూలు జిల్లా నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, అనంతపురం జిల్లా నుంచి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నెల్లూరు జిల్లా నుంచి కిలివేటి సంజీవయ్యలు మంత్రివర్గంలో పదవులు ఆశిస్తున్నారు. మరి వీరిలో పదవులు ఎవరిని వరిస్తాయో అనేది వేచి చూడాలి.

మల్లాది విష్ణుకు మంత్రి పదవి దక్కేనా?

ఇకపోతే ఎస్టీ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం విజయనగరం జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణి ఉన్నారు. అయితే ఆమెను పదవి నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఈమె స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విశ్వసరాయి కళావతికి చాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా రేసులో ఉన్నారు. పార్టీ ఏర్పాటు నుంచి బాలరాజు వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్‌ బాటలో పయనించారు. సీనియర్‌ నేత రాజన్న దొర కూడా మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం విషయానికి వస్తే విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిలు రేసులో ఉన్నారు.


Next Story