- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశీయ కరెన్సీ సరికొత్త జోరు.. భారీగా పెరిగిన రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు, డాలర్ బలపడటం వంటి కారణాలతో కొంత కాలంగా నెల చూపులు చూసిన రూపాయి విలువ ఈ రోజు భారీగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు, డాలర్ బలపడటం వంటి కారణాలతో కొంత కాలంగా నెల చూపులు చూసిన రూపాయి విలువ (Value of Rs) ఈ రోజు భారీగా పెరిగింది. భారత్ -అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం (Trade agreement) దేశీయ కరెన్సీకి కొత్త ఊపిరి పోసింది. మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 119 పైసలు పెరిగి 90.30 వద్ద స్థిరపడింది. అమెరికా విధిస్తున్న సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్ స్పందన- గణాంకాలు
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి 90.30 వద్ద ప్రారంభమైంది. ఇది సోమవారం నాటి ముగింపు (91.49) కంటే 119 పైసలు ఎక్కువ. సుంకాల తగ్గింపుతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ బలోపేతం కావడంతో, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) తిరిగి భారతీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. ఈ సానుకూల వార్తతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 2,138 పాయింట్లు (2.62%), నిఫ్టీ 607 పాయింట్లు (2.42%) మేర పెరగడంతో రూపాయి విలువ కూడా పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులపై ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్ఎల్పి (Finrex Treasury Advisors LLP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "అమెరికా సుంకాలు 18 శాతానికి తగ్గడం భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఆధిక్యాన్ని అందిస్తుంది" అని తెలిపారు. దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభావం- భవిష్యత్తు
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి అంగీకరించింది. దీనివల్ల అమెరికా గతంలో విధించిన 25 శాతం అదనపు శిక్షార్హమైన సుంకాలను (Punitive Tariffs) కూడా తొలగించింది. సుంకాల్లో తగ్గుదల, బలపడుతున్న రూపాయి వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గి, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.






