- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం : సీపీ అంబర్ కిషోర్ ఝా
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైందని, పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

దిశ, మంచిర్యాల : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైందని, పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్ల గురజాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన సీపీ, ప్రతిరోజు నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేసి, పెండింగ్ కేసుల పై ఆరా తీశారు. కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యత అత్యంత కీలకమని అన్నారు. కేసుల దర్యాప్తు, విచారణ, పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విధుల్లో సమయపాలన, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని, ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, కేసుల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఇరువర్గాల వాదనలు పూర్తిగా విని, నిష్పాక్షికంగా న్యాయసేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీసుల పై విశ్వాసం పెరిగేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నిరంతర గస్తీ నిర్వహించాలని, సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని చెప్పారు. అలాగే నకిలీ పత్తి విత్తనాలు, గంజాయి, గుడుంబా నిర్మూలన దిశగా మరింత సమర్థంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, రూరల్ సీఐ హనుక్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






