రైతులకు కాంగ్రెస్ ‘మరణశాసనం’!

by Batti.Sumithra |

దేశానికే వెన్నుముకగా నిలిచిన తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు దారుణంగా వెన్నుపోటు పొడిచిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రైతులకు కాంగ్రెస్ ‘మరణశాసనం’!
X

దిశ, హుస్నాబాద్ : దేశానికే వెన్నుముకగా నిలిచిన తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు దారుణంగా వెన్నుపోటు పొడిచిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం చెప్పిన కోటా వరకే పంటలు కొంటాం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా ఒక్క గింజ కూడా కొనే ప్రసక్తే లేదని చెప్పడం రైతుల పాలిట మరణ శాసనమేనని ఆయన మండిపడ్డారు. శనివారం హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నాడు పండుగ.. నేడు దండుగ !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రైతు బతుకులను ఛిద్రం చేశారని సతీష్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పదేళ్లపాటు ధీమాగా బతికిన రైతును మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాల్లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో సాగునీరు అందించి, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చామన్నారు. సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 30 లక్షల ఎకరాలకు పెంచి తెలంగాణను ‘ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మార్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలోనూ కల్లాల వద్దకే వచ్చి వరితో పాటు 8 రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు.

అబద్ధపు హామీలతో దగా..

ఎన్నికల సమయంలో ప్రతి పంటను చివరి గింజ వరకు కొంటామని, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందని విమర్శించారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘రూ.10 వేల కోట్లు ఇస్తే అన్ని పంటలు కొని చూపిస్తా’ అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు చేతులెత్తేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. 71 సార్లు ఢిల్లీ యాత్రలు చేసిన సీఎం, ఒక్కసారైనా పంట కొనుగోళ్ల పై కేంద్రంతో మాట్లాడారా అని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని అన్నదాతలను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం !

ప్రభుత్వ అసమర్థత, వేధింపుల వల్లే రాష్ట్రంలో ఇప్పటికే వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు కుప్పకూలుతున్న ఈ సర్కారుకు కనికరం లేదని సతీష్ కుమార్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారుకు కర్రుగాల్చి వాత పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయకపోతే.. 70 లక్షల మంది రైతులు, 4 కోట్ల తెలంగాణ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘జంగ్ సైరన్’ మోగించి, కాంగ్రెస్ మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు.

Next Story