- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిలో దారుణం: మగపిల్లలైతే రూ.8 లక్షలు, ఆడపిల్లలకైతే సగం ధర!
దేశ రాజధాని నగరంలో పసిగుడ్డుల అక్రమ రవాణా, విక్రయాలు సాగిస్తున్న ఒక ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని నగరంలో పసిగుడ్డుల అక్రమ రవాణా, విక్రయాలు సాగిస్తున్న ఒక ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. సంతానం లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, పసిబిడ్డలను వస్తువుల్లా అమ్ముతున్న ఒక భారీ అంతరాష్ట్ర 'బేబీ ట్రాఫికింగ్' నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ దందాలో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేర్వేరుగా రేట్లు కట్టి వ్యాపారం చేస్తుండటం కలకలం రేపుతోంది. ముఠా సభ్యులు మగ నవజాత శిశువులను రూ.6 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు విక్రయిస్తుండగా, ఆడపిల్లలను అందులో సగం ధరకే (రూ. 3 నుండి 4 లక్షలు) అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆసుపత్రి కేంద్రంగా దందా.. డాక్టర్ అరెస్ట్..
నార్త్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణి పరిధిలో ఓ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దందాకు సూత్రధారి అయిన ఆసుపత్రి యజమానితో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి బారి నుండి ఐదుగురు పసికందులను (ఐదు రోజుల నుండి నాలుగు నెలల వయసు గలవారు) సురక్షితంగా రక్షించారు. ఈ ముఠా ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పేద కుటుంబాలు, గిరిజన ప్రాంతాల నుండి తక్కువ ధరకు (రూ.20 వేల నుండి లక్ష రూపాయల లోపు) పసిపిల్లలను కొనుగోలు చేసేది. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ ప్రధాన సప్లయర్ ద్వారా ఈ పిల్లలను కార్లలో ఢిల్లీకి తరలించేవారు. పోలీసులకు లేదా తనిఖీల్లో అనుమానం రాకుండా ఉండేందుకు కార్లలో ఒక పురుషుడు, స్త్రీ కలిసి భార్యాభర్తల్లా నటిస్తూ పిల్లలను మోసుకొచ్చేవారని దర్యాప్తులో తేలింది.
ఫేక్ బర్త్ సర్టిఫికెట్లతో అక్రమ దత్తత..
పిల్లలను కొనుగోలు చేసిన దంపతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు డాక్టర్ తన ఆసుపత్రిలోనే ఫేక్ డెలివరీ రికార్డులు, నకిలీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను సృష్టించేవాడు. ఒక కేసులో గ్వాలియర్‌కు చెందిన దంపతులకు మగపిల్లాడిని అమ్మడమే కాకుండా, మరో లక్ష రూపాయలు ఇస్తే ఆడపిల్లని కూడా ఇస్తామని, కవల పిల్లలు పుట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చారు. ఢిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలో ఒక మహిళ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు పసిపిల్లలతో తిరుగుతుండటాన్ని గమనించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కస్టమర్లలా నటిస్తూ ముఠా సభ్యులను సంప్రదించారు. రూ.5 లక్షలకు మగపిల్లాడిని అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ ఇస్తుండగా ముఠా ప్రధాన నిర్వాహకురాలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మిగతా 12 మందిని నెట్‌వర్క్‌ను అరెస్ట్ చేశారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా సాగుతున్న ఈ దందాలో ఇప్పటివరకు సుమారు 300 మందికి పైగా పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి ఆర్థిక లావాదేవీలు మరియు మిగతా పిల్లల వివరాలకై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.






