- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఓటును కాపాడే బాధ్యత కాంగ్రెస్ BLAలదే : ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) ప్రధాన బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

దిశ, దేవరకొండ టౌన్ : ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) ప్రధాన బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. నియోజకవర్గంలోని దేవరకొండ మండలం, పట్టణ కాంగ్రెస్ పార్టీ BLAలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం పట్టణంలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన SIR ఓటర్ల సవరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి BLA పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత పేర్లను నమోదు చేయడంతో పాటు, తప్పుగా తొలగించిన లేదా పొరపాట్లు ఉన్న ఓట్లను వెంటనే సవరించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదై ఉండేలా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న SIR ప్రక్రియ నేపథ్యంలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా BLAలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పరిశీలిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SIR కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించారని, అదే స్ఫూర్తితో దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి బూత్‌ను పరిశీలించి అర్హులైన ప్రతి ఓటును కాపాడేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధి, విద్య కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన నియోజకవర్గ ఓటర్ల వివరాలను సేకరించి, వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
అనంతరం నమోదు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై BLAలు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులకు సమగ్ర అవగాహన కల్పించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా SIR కార్యక్రమంలో చురుకుగా పనిచేస్తున్న పలువురు BLAలను ఎమ్మెల్యే బాలు నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు మారుపాకుల సురేష్ గౌడ్, మహ్మద్ రయీస్, లోకాసాని శ్రీధర్ రెడ్డి, మహ్మద్ యూనూస్, SIR కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, BLAలు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






