పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

by Ratna Kumari |

పీఆర్‌సీ ప్రకటించి, సీపీఎస్ రద్దు చేయాలని తపస్ డిమాండ్. ఉపాధ్యాయుల సమస్యలపై గద్వాలలో ధర్నా నిర్వహించారు.

పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి
X

దిశా, జోగులాంబ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే ప్రకటించి, సీపీఎస్‌ను రద్దు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా పీఆర్‌సీ ప్రకటించకపోవడం, డీఏ బకాయిలు విడుదల చేయకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేస్తోందన్నారు.

పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీతో పాటు ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. అలాగే 317 జీవో వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని, ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలోనే పాఠశాలలకు అవసరమైన గ్రాంట్లు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, అయ్యస్వామి, జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, మహిళా కన్వీనర్ అరుణశ్రీతో పాటు ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.

Next Story