హైడ్రా యాక్షన్.. రామంతాపూర్ పెద్దచెరువులో భారీ ఆక్రమణల కూల్చివేత

by Ramesh Naini |

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది.

హైడ్రా యాక్షన్.. రామంతాపూర్ పెద్దచెరువులో భారీ ఆక్రమణల కూల్చివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది. రామంతాపూర్ పెద్ద చెరువు ఎప్‌టీఎల్ విస్తీర్ణం 30 ఎక‌రాలు కాగా.. 16 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జాకు గురైంది. ఇందులో 12 ఎక‌రాల్లో శాశ్వ‌త క‌ట్ట‌డాలు వ‌చ్చాయి. వీటి జోలికి వెళ్ల‌కుండా మ‌రో 4 ఎక‌రాల మేర తాత్కాలిక షెడ్డులు, గుడిసెలుంటే వారికి డ‌బుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరుకు హైడ్రా సిఫార‌సు చేసింది. ఇలా మొత్తం 18 ఎక‌రాల మేర చెరువును అభివృద్ధి చేస్తున్న క్ర‌మంలో 1900 గ‌జాల మేర జీ ప్ల‌స్ 2 నిర్మాణంలో ఉన్న వాణిజ్య భ‌వ‌నంతో పాటు.. 280 గ‌జాల మేర ఉన్న ఆటో గ్యారేజీని కూడా హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది.

వ‌ర్షాకాలం చెరువు నిండితే గుడిసెలు మునిగిపోయేవి.. అక్క‌డ నివ‌సిస్తున్న వారు ప్ర‌తి ఏటా చాలా అవ‌స్థ‌లు ప‌డుతుండేవారు. చెత్త సేక‌ర‌ణ‌తో పాటు.. కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగించే వారికి డ‌బుల్‌బెడ్‌రూం ఇళ్ల మంజూరీకి హైడ్రా సిఫార‌సు చేయ‌గా.. ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించిన విష‌యం విధిత‌మే. ప్ర‌భుత్వం కూడా కేటాయింపులో ప్రాధాన్యం ఇళ్లు మంజూర‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంది. దాదాపు రూ.19 కోట్లతో రామంతాపూర్ పెద్ద‌చెరువును అభివృద్ధి చేస్తున్న క్ర‌మంలో ఎఫ్‌టీఎల్ విస్త‌ర‌ణ ప‌నుల‌కు ఆటంకాలు తొల‌గాయి. రామంతాపూర్ చెరువు అభివృద్ధి ప‌నుల్లో ఎలివేష‌న్‌కు ఈ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

Next Story