- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోరాహోరీగా 'గుర్తుల' రాజకీయం
ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ పీఠాలను దక్కించుకోవడం ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ పీఠాలను దక్కించుకోవడం ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నిన్నటి దాకా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 'పార్టీ రహితం' పేరుతో సైలెంట్‌గా ఉన్న హేమాహేమీలు.. ఇప్పుడు మున్సిపల్ సమరంలో 'వైలెంట్' అవుతున్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఈ పోరులో వచ్చే ఫలితాలే తమ పొలిటికల్ కెరీర్‌కు 'లైఫ్ సర్టిఫికేట్' అని భావిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. విందులు, వినోదాలతో ఓటర్లను కట్టి పడేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఖాయమైన వేళ.. ఏ వార్డులో ఏ గాలి వీస్తుందో తెలియక నేతల్లో ముందస్తు వణుకు మొదలైంది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయం వేడెక్కింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరగడంతో నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్స్‌పై జరుగుతుండటంతో.. ఇక్కడ వచ్చే ఫలితాలే తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అటు మంత్రులు, ఇటు మాజీ మంత్రులు భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలను 'ఛాలెంజ్ గా తీసుకుని అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అంతా తామై నడిపిస్తున్నారు.
వ్యూహాల్లో బిజీ.. గెలుపు గుర్రాల వేట!
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు తమ తమ పరిధిలోని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూరుతుందని భావించి, క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నారు. కుల సమీకరణలు, వర్గ పోరాటాలను బేరీజు వేస్తూ అభ్యర్థుల గెలుపు గుర్రాలను రంగంలోకి దించుతున్నారు.
విందులు.. వినోదాలు.. ఆపై 'పంపిణీ' అస్త్రాలు!
ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ హామీల జల్లు కురిపిస్తున్నారు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని భావించిన చోట పెద్ద ఎత్తున మద్యం, నగదు పంపిణీకి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే పలుచోట్ల 'లోకల్' సెటిల్మెంట్లు, భారీగా నిధుల కేటాయింపులపై హామీలు ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పాలమూరు గడ్డపై త్రిముఖ పోరు!
గతంలో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే సాగింది. కానీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారింది. బీజేపీ సైతం బలమైన శక్తిగా ఎదగడంతో ఇప్పుడు మున్సిపల్ పోరు 'త్రిముఖ' పోటీగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు మొదలైంది. ఏ ఏరియాలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.






