ఆ యూనివర్సిటీలో వివాదాలకు నిలయయంగా అర్బన్ స్టడీస్ సెంటర్!

by Web Desk |

ఆ యూనివర్సిటీలో వివాదాలకు నిలయయంగా అర్బన్ స్టడీస్ సెంటర్!
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కేంద్రం ఇటీవల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో ఓ మహిళా డైరెక్టర్ తొలగింపు.. కొత్త డైరెక్టర్ నియామకం.. ఇటీవల 2014 తర్వాత విధుల్లోకి చేరిన ఉద్యోగుల తొలగింపు తదితర సంఘటనలతో ఈ సెంటర్ వివాదస్పదంగా మారింది.

సెంటర్‌లో అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతుండగా, విద్యార్థి సంఘాల ఆరోపణలు అవాస్తవమని అధికారులు చెపుతూ ఎవరికి వారే తాము చేసింది రైట్ అన్నట్టుగా నిర్దారించుకుంటున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1970లో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయ, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు చెందిన వారికి అర్బన్, రూరల్ అడ్మినిస్ట్రేషన్ పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు.

ఈ శిక్షణలో భాగంగా ఈ సెంటర్‌కు వచ్చే వివిధరకాల ప్రాజెక్టుల నిర్వహణ కోసం కొంత మంది పరిశోధనా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ సెంటర్‌లో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి మొత్తగా 40 మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సంస్థలో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను అధికారులు తొలగించారు. ఈ తొలగింపును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు.

14 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు..

ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అరుణ గత ఏడాది ఈ సెంటర్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆమె పదవిలోకి వచ్చిన రెండు నెలలకే సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న 14 మందిని తొలగించారు. వీరిలో నలుగురు 2014కు ముందు డ్యూటీ లో చేరిన వారు, కాగా మిగతా 10 మంది 2014 తర్వాత విధుల్లోకి చేరిన వారున్నారు. గత ఏడేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తమను ఎలా తొలగిస్తారంటూ సదరు ఉద్యోగులు, బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.

దీంతో సదరు డైరెక్టర్ కొంత వెనక్కి తగ్గడంతో వారంతా తిరిగి విధుల్లోకి చేరారు. ప్రొఫెసర్ అరుణ పదవీ కాలం పూర్తవడంతో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ కొద్దినెలలు సెంటర్‌కు ఇంచార్జి డైరెక్టర్‌గా వ్యవహరించారు. తరువాత ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుమార్‌ను ఓయూ వీసీ డైరెక్టర్ నాలుగు నెలల క్రితం డైరెక్టర్‌గా నియమించారు.

ప్రస్తుత డైరెక్టర్ హయాంలో ఈ 14 మంది ఉద్యోగుల తొలగింపు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో దీనిపై సెంటర్ గవర్నింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 2014 జూన్ 2 తర్వాత కాంట్రాక్ట్ ప్రాతిపదిక చేరిన ఉద్యోగులను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు కమిటీ తీర్మానించి 2014 తర్వాత విధుల్లోకి చేరిన 10 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థుల ఆందోళన..

ఉద్యోగులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. 2014 ప్రభుత్వ ఉత్వర్వుల పేరుతో సెంటర్‌లో 10 మంది ఉద్యోగులను తొలగించారని, ఇది ఉద్యోగుల తొలగింపు లేబర్ యాక్ట్‌కు విరుద్దమని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అకారణంగా ఉద్యోగులను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2014 తరువాత ఓయూలో అనేక మందిని నియమించారని, వారందరికీ ఈ నిబంధనలు వర్తించవా..? అని ప్రశ్నించారు.

ఓయూ అంబేద్కర్ రీసెర్చ్ స్టడీ సెంటర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ లో రిటైర్డ్ ప్రొఫెసర్‌లను ఎలా నియమించారని, వారికి ఈ నిబంధనలు వర్తించవా..? అని వారు ప్రశ్నించారు. ఒక వైపు అర్బన్ సెంటర్ లో ఉన్న పది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసివేస్తూ మరొకవైపు రిటైర్ అయిన వారిని ఉద్యోగులుగా నియమిమించుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమన్నారు. ఓయూ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న వీసీ ఓయూ ను నిండా ముంచే పనిలో మాత్రం ముందున్నాడని ఆరోపించారు.

Next Story