డ్రగ్స్ నిలయంగా తెలంగాణ.. విచ్చలవిడిగా విక్రయాలు

by Disha Web Desk 2 |
డ్రగ్స్ నిలయంగా తెలంగాణ.. విచ్చలవిడిగా విక్రయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: "2016, జూన్‌లో విడుదలైన సినిమా.. ఉడ్తా పంజాబ్. కథ అందరికీ తెలిసిందే. అయినా ఒక్కసారి కథలోకి వెళ్తే స్థూలంగా.. పాక్ తరహా ముస్లిం దేశాలనుంచి వచ్చే డ్రగ్స్ మాఫియా మొదటి టార్గెట్ అయిన పంజాబ్‌లోని చీకటి కోణాల మీద సెర్చ్ లైట్ వేసినట్లుగా రూపొందించారు. పంజాబ్ యూత్ ఐకాన్‌గా పేరుతెచ్చుకున్న పాప్ సింగర్ టామీ డ్రగ్స్‌కి బానిసవుతాడు. ఎంతదాకా అంటే చివరికి ఆ మత్తులో ఉంటే తప్ప పాట పాడలేని స్థికి చేరుకుంటాడు. ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన పింకీ అనుకోని పరిస్థితుల్లో బీహార్ నుంచి పంజాబ్‌కు కూలీగా వలసవెళ్లి మాదకద్రవ్యాల వలలో పడిపోతుంది. డ్రగ్స్ మాఫియా నుంచి లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ సర్తాజ్ చివరికి ఆ డ్రగ్స్ వల్లే తన సోదరుడ్ని కోల్పోతాడు. ఇది కథ. వీరి జీవితాల్లోని ప్రతి అంకం డ్రగ్స్‌తో ముడిపడి ఉన్నదే. డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న టామీ సింగ్, అదే మాదకద్రవ్యాల కారణంగా చిక్కుల్లో పడ్డ పింకీ పరిస్థితులు, సర్తాజ్ లాంటి అవినీతి పోలీస్ ఆఫీసర్ వంటి వారితో ఈ దేశం ఎంత నష్ట పోయిందనేది కళ్లకు కట్టినట్టుగా చూపించారు."

ప్రస్తుతం తెలంగాణ అదే తరహాగా మారిపోయింది. రెండేండ్ల కిందట వరకు భాగ్యనగరానికే పరిమితమైన మహమ్మారి.. ఇప్పుడు జిల్లాలకూ పాకింది. పబ్‌లో, స్టార్​హోటళ్లలో దొరికే డ్రగ్.. విద్యా సంస్థల ముంగిట దుకాణాలు తెరిచింది. ఇదంతా బహిర్గతమైంది ఏకంగా ప్రభుత్వ పరిశీలనల్లోనే. రాష్ట్రంలో ఇటీవల డ్రగ్స్​ వ్యవహారంపై కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన అధికారుల బృందం రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసింది. ఎక్సైజ్​అధికారుల నుంచి వివరాలు సేకరించింది. దీనిలో భాగంగానే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

భాగ్యనగరం నుంచి గ్రామీణం వరకూ

తెలంగాణ మత్తులో జోగుతోంది. మత్తు పదార్థాల తయారీకి నిలయంగా రాజధాని రూపాంతరం చెందింది. గతంలో జీడిమెట్లలోనూ మెపిడ్రిన్​అధికారులకు చిక్కగా.. తాజాగా గడ్డిపోతారంలోని ల్యూసెంట్​పరిశ్రమ కూడా డ్రగ్స్​దందాకు కేంద్రంగా మారింది. ఏకంగా 25వేల కిలోల ట్రమడాల్​డ్రగ్స్‌ను పాకిస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎగమతి చేసినట్లుగా ఎన్సీబీ దర్యాప్తులో తేలింది. ఒక చిన్న కంపెనీ ఏడాదిలో 25 కిలోల డ్రగ్స్​ఉత్పత్తి చేసి, సరఫరా చేసిందంటూ ఇంకా ఎన్ని కంపెనీలు ఈ వ్యాపారం చేశాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనూ జీడిమెట్లలో డ్రగ్స్ తయారీ జరుగుతోందన్న సమాచారంతో అధికారులు దాడులు చేసి 250 కిలోల మెపిడ్రిన్‌ పట్టుకున్నారు. ఫార్మా కంపెనీల్లో పని చేసే కొంతమంది కేటుగాళ్లు మాఫియాతో చేతులు కలిపి ఇక్కడి పారిశ్రామికవాడల్లోనే డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిని స్థానికంగా విక్రయించడమే కాదు.. ఎగుమతులు కూడా చేస్తున్నారు. ఇందుకు మూతపడిన రసాయన, ఫార్మా పరిశ్రమలు కేంద్రాలుగా మారుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో తాళాలు వేసిన ఆ పరిశ్రమల యజమానులకు మాఫియా పెద్ద మొత్తంలో డబ్బు ఎరగా వేసి డ్రగ్స్‌ను తయారు చేయిస్తోంది. తక్కువ ఖరీదు రసాయనాలను రియాక్టర్లలో ప్రాసెస్‌ చేసి.. అంతర్జాతీయ స్థాయిలో విలువైన డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. మెపిడ్రిన్‌తో ఎండీఎంఏ, కొకైన్, అంపెటమిన్ డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు వెల్లడవుతోంది.

మూడు ప్రమాదాలు అవే

రాష్ట్రంలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాలు డ్రగ్స్​కారణంగానే జరిగినట్లు పోలీసులు సైతం నిర్ధారించారు. కానీ, ఈ కేసుల్లో రాజకీయ నేతలకు లింకులుండటంతో డ్రగ్స్​అంశాన్ని తెరపైకి రాకుండా చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే కొడుకు.. బంజారాహిల్స్​లోని ఓ పబ్‌లో డ్రగ్స్​ తీసుకుని, కారు నడిపినట్లు కేంద్ర అధికారుల విచారణలో తేలింది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బుల్లితెర నటి కూడా డ్రగ్స్​మత్తులోనే వాహనం నడిపినట్లు గుర్తించినట్లు సమాచారం. అంతకు ముందు మరో ప్రమాదంలో కూడా డ్రగ్స్​వాడినట్లు తేలింది. ఈ మూడు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రగ్స్​ వినియోగం. ప్రమాదానికి ముందు పబ్‌లలో నుంచి వచ్చిన వారు అక్కడే డ్రగ్స్​తీసుకున్నట్లు తేలింది. కానీ, పోలీసులు మాత్రం దీన్ని దాచిపెట్టుతున్నారు.

కేంద్ర బృందం ఏం పరిశీలించింది

ఇటీవల రాష్ట్రంలో డ్రగ్స్​దందా భారీగా బయటకు వచ్చింది. ఇంటర్నేషనల్​ఫెడ్లర్​టోనీతో పాటుగా పలువురిని అరెస్ట్​ చేశారు. అంతేకాదు.. గతంలో సినీ తారల వ్యవహారంపై కూడా ఈడీ వివరాలడిగింది. ఎక్సైజ్​శాఖ వివరాలను ఇప్పటికీ దాచి పెట్టుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో కొంతమంది ఆయా సంస్థల పరిధిలోని అధికారుల బృందం డ్రగ్స్​ వివరాలను తీసుకుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అబ్కారీ శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా పలు ప్రాంతాల్లో పర్యటించింది. పలువురు పోలీసు, ఎక్సైజ్​అధికారుల నుంచి వివరాలు సేకరించింది.

యాష్​గంజా.. కొకైన్

రాష్ట్రంలో ఆయిల్​తరహాలోని యాష్​గంజాతో పాటుగా కొకైన్​కూడా ఎక్కువగా దొరుకుతుందని తేలింది. పారిశ్రామికవాడలు, బస్తీలతో పాటుగా జిల్లా కేంద్రాల్లోని కార్మిక వాడలు, బస్తీల్లో యాష్​గంజా వినియోగం పెరిగినట్లు గుర్తించారు. రాష్ట్రంలో 18 ఏండ్లలోపు వారిలో 32.1 శాతం మాదక ద్రవ్యాలకు అలవాడు పడినట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. ఏపీలోనూ ఈ పరిస్థితి ఉంది. ఏపీలో 18 ఏండ్లలోపు వారి శాతం ఏకంగా 42గా ఉన్నట్లు కేంద్ర బృందంలోని ఓ అధికారి వెల్లడించారు. కొకైన్‌ పంపిణీకి హైదరాబాద్‌ ప్రాంతీయ హబ్‌గా మారింది. అంతేకాకుండా 20 ఏళ్ల వయసులోపు వారు 13.1 ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 50,923 మంది వీధి బాలలను పరిశీలిస్తే.. అందులో 46,410 మంది మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు గుర్తించామని సదరు అధికారి ఆఫ్​ది రికార్డుగా తెలిపారు.

తాజా రిపోర్టు ప్రకారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికలో డ్రగ్స్ అంటే కేవలం హెరాయిన్ ఒక్కటే కాదని, విరివిగా దొరికే గంజాయి కూడా డ్రగ్సేనని, నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తర్వాత నేరాలు పెరుగుతున్నట్లు సైతం గుర్తించారు. అయితే, విలాసవంతమైన జీవనం సాగిస్తున్న వారు డ్రగ్స్​బాధితులుగా ఉంటున్నారని, డ్రగ్స్ తీసుకుంటే నిత్య నూతనంగా ఉండొచ్చని, స్కిన్‌టోన్ మారదని, ముఖంపై ముడతలు రావని, కండలు పెంచవచ్చనే అభిప్రాయంతో కూడా డ్రగ్స్‌కు బానిసవుతున్నట్లు తేల్చారు.

యూపీ, పంజాబ్‌, దిల్లీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యసనపరుల సంఖ్య ప్రాతిపదికన తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ తాజా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో రెండేండ్ల కిందట వరకు ఇంజినీరింగ్, మెడికల్​ కాలేజీలు, యూనివర్సీలకు పరిమితమైన డ్రగ్స్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు కూడా చేరాయని కేంద్ర ప్రభుత్వ అధికారుల పరిశీలనలో తేలింది. ఏ కాలేజీలో పరిశీలించినా.. డ్రగ్స్‌ విక్రేతలున్నారని గుర్తించారు.



Next Story

Most Viewed