ఇల్లు కాజేయాలనే దురాశ.. మేనమామను హత్య చేసిన వ్యక్తి.. చివరికి!?

by Jakkula.Mamatha |

సిరిసిల్లలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.

ఇల్లు కాజేయాలనే దురాశ.. మేనమామను హత్య చేసిన వ్యక్తి.. చివరికి!?
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మేనమామను హత్య చేసి ఆయన ఇంటిని స్వాధీనం చేసుకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలనే ఉద్దేశంతో నేరానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు శనివారం సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, సిరిసిల్ల పట్టణం బివై నగర్ కు చెందిన, ప్రస్తుతం వేములవాడ న్యూ అర్బన్ కాలనీకి నివాసం ఉంటున్న పుప్పాల శ్రీకాంత్ కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆరు సంవత్సరాల క్రితమే విడిచి వెళ్లిపోయింది.

అనంతరం తల్లితో కలిసి సిరిసిల్లలో నివసిస్తూ మద్యం కోసం తరచూ డబ్బులు అడిగి వేధించేవాడు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం తన తల్లి సోదరుడు రాగుల ఎల్లయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా డబ్బుల కోసం గొడవకు దిగాడు. దీంతో ఎల్లయ్య అందరి ఎదుట శ్రీకాంత్‌ను మందలించి కర్రతో కొట్టడంతో అతను తీవ్ర అవమానంగా భావించి మేనమామపై కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో ఎల్లయ్యకు భార్య పిల్లలు లేకపోవడం, ఆయన ఇల్లు తనకు దక్కుతుందనే ఆశతో హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు నెలల క్రితం తల్లి మరణించడంతో తన ఖర్చులకు డబ్బు ఇచ్చే వారు లేకపోవడంతో ఎలాగైనా మేనమామను హత్య చేసి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని విచారణలో వెల్లడైంది.

జూలై 4న సిరిసిల్ల మార్కెట్‌లో ఎల్లయ్యను కలిసిన శ్రీకాంత్, పెద్దూరు శివారుకు తీసుకెళ్లి కల్లు, మద్యం తాగించాడు. మత్తులో ఉన్న సమయంలో గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించగా బాధితుడు ప్రతిఘటించడంతో సమీపంలోని బండరాయితో తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని పాత బట్టలతో కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఎల్లయ్య కనిపించకపోవడంతో ఆయన బంధువు రాగుల శారద సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు హైదరాబాద్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సిరిసిల్ల ఎల్లమ్మ చౌక్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.

Next Story