ఎస్. జానకి మృతి.. సీఎం రేవంత్, కేంద్రమంత్రుల సంతాపం

by Naga Rani Yarlagadda |

ప్రముఖ సినీనేపథ్య గాయని ఎస్. జానకి గుండెపోటుతో మరణించారు. మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానకి శనివారం ప్రాణాలు విడిచారు.

ఎస్. జానకి మృతి.. సీఎం రేవంత్, కేంద్రమంత్రుల సంతాపం
X
  • సంతాపం తెలిపిన ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రముఖ సినీనేపథ్య గాయని ఎస్. జానకి గుండెపోటుతో మరణించారు. మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానకి శనివారం ప్రాణాలు విడిచారు. ఎస్. జానకి మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం

ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారు తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటుగా మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని సీఎం గుర్తుచేశారు. జానకమ్మ మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం

భారతీయ సినీ సంగీత సామ్రాజ్యంలో తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గాన కోకిల ఎస్. జానకి కన్నుమూశారనే వార్త ఎంతో విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయం, జానకి కేవలం గాయని మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి ఒక నిధి అన్నారు.

దక్షిణ భారత గాన కోకిల ఎస్.జానకి మరణం బాధాకరం : కేంద్రమంత్రి బండి సంజయ్

జానకి మరణం భారతీయ సంగీతానికి ప్రత్యేకించి దక్షిణాదికి తీరని లోటు, కోట్లాది హృదయాలను తన మధుర స్వరంతో పరవశింపజేసిన ప్రముఖ నేపథ్య గాయని జానకి అని కేంద్రమంత్రి బండి సంజయ్ తన సంతాపాన్ని తెలిపారు. జానకి స్వరం ఎన్నో తరాల మధుర జ్ఞాపకం, సంతోషం, బాధ, ప్రేమసహా ప్రతి భావానికి తోడుగా జానకి పాట నిలిచిందన్నారు. ఎస్.జానకి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాటకు మాత్రం మరణం లేదు, తరాలు మారినా, కాలం గడిచినా ఆమె స్వరం భారతీయుల హృదయాల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హారీష్​రావు తదితరులు ఉన్నారు.

Next Story