- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన శనివారంతో 22వ రోజుకు చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన శనివారంతో 22వ రోజుకు చేరుకుంది. ఈ నిరసనకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హాజరై తన సంఘీభావాన్ని ప్రకటించారు. దేశ యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తామంతా అండగా ఉంటామని ఆయన చాటిచెప్పారు. ప్రకాష్ రాజ్‌తో పాటు కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, సీపీఎం నేత జితేంద్ర చౌదరి కూడా నిరసన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
14వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష..
ఈ ఆందోళనలో భాగంగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. నిరంతర ఉపవాసం వల్ల ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించి, సుమారు 7.5 కిలోల బరువు తగ్గారు. అయినప్పటికీ ఆయన మానసిక ధైర్యంతో దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ‘నన్ను ఎవరూ ‘ఆధునిక గాంధీ’ అనో, ‘హీరో’ అనో పిలవవద్దు. నేను కేవలం బాధ్యత గల సాధారణ పౌరుడిని మాత్రమే. దేశంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే ప్రజలంతా వేడుక చూసేవారిలా ఉండకుండా, బాధ్యతగా స్పందించి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు. లడఖ్ సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జూలై 20న పార్లమెంట్ మార్చ్
పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షల వైఫల్యాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేందుకు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజైన జూలై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు భారీ శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మార్చ్‌లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రకాష్ రాజ్, వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేశారు.






