మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వెలుగు..

by Batti.Sumithra |

చందంపేట మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చిత్రియాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వెలుగు..
X

దిశ, చందంపేట : చందంపేట మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చిత్రియాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామ సర్పంచ్ చిరంజీవి చొరవ, ఉపాధ్యాయుల కృషి, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏకంగా 40 మంది కొత్త విద్యార్థులు అడ్మిషన్లు పొందడం విశేషంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సర్పంచ్ చిరంజీవి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపేందుకు ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిరంజీవి మాట్లాడుతూ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యే అభివృద్ధికి ప్రధాన మార్గమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉందని, విద్యార్థుల సంఖ్య పెరగడం అందరి సమిష్టి కృషికి నిదర్శనమని తెలిపారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా పుస్తకాలు అందించి, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠ్యపుస్తకాల పంపిణీతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామస్థుల సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో విద్యా వెలుగు విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిరంజీవి చాట్ల, మండల విద్యాధికారి రామలింగయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టాక్రూ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story