- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM విజయ్ అంత సైలెంట్‌గా ఎందుకుంటారు?.. 'దళపతి' జీవితాన్ని మార్చేసిన ఆ విషాదం ఏంటి?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (దళపతి విజయ్) గత జీవితం, ఆయన కుటుంబ నేపథ్యంపై ఆయన తల్లి శోభ చంద్రశేఖర్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (దళపతి విజయ్) గత జీవితం, ఆయన కుటుంబ నేపథ్యంపై ఆయన తల్లి శోభ చంద్రశేఖర్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాము ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంగా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్న ఆమె.. విజయ్ రెండేళ్ల వయసున్నప్పుడు ఆయన చిన్న చెల్లెలు విధ్య మరణించడం విజయ్‌పై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపిందో, ఆయనను ఎలా మార్చేసిందో వివరించారు.
చెల్లెలి మరణం చూపిన ప్రభావం..
ఒక ఇంటర్వ్యూలో శోభ చంద్రశేఖర్ మాట్లాడుతూ. 1984లో విజయ్ చెల్లెలు విధ్య మరణించిన సమయంలో, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయ్ తండ్రి చంద్రశేఖర్ షూటింగ్ పనుల నిమిత్తం బయట ఉన్నారని గుర్తుచేసుకున్నారు. "ఆ ఘటన జరగకముందు వరకు విజయ్ ఎంతో సరదాగా, చురుగ్గా, అల్లరిగా ఉండేవాడు. కానీ నా కుమార్తె మరణం విజయ్‌తో పాటు మా కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా మార్చేసింది. అంతవరకు బాగా మాట్లాడే విజయ్, ఆ తర్వాత చాలా సైలెంట్‌గా మారిపోయాడు. స్కూల్లో క్లాస్ జరుగుతున్నప్పుడు 'అక్కాచెల్లెళ్లు' అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా విజయ్ ఎమోషనల్ అవ్వడాన్ని ఆయన టీచర్లు కూడా గమనించారు" అని శోభ తెలిపారు.
డాక్టర్ కావాలనుకున్న తల్లిదండ్రులు.. పైలట్ కావాలనుకున్న విజయ్ "మా కుమార్తెను కోల్పోయిన తర్వాత.. విజయ్‌ను డాక్టరు చేయాలనే కోరిక మాలో మరింత బలంగా నాటుకుంది. కానీ విజయ్‌కి మాత్రం వేరే ఆలోచనలు ఉండేవి. అతనికి దాదాపు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు 'పైలట్' అవ్వాలనేది కోరిక. ఆ తర్వాతే అతను నటన వైపు అడుగులు వేశాడు" అని ఆమె పేర్కొన్నారు. విజయ్ స్వభావం గురించి చెబుతూ.. ఆయన కేవలం తన అత్యంత సన్నిహితుల వద్ద మాత్రమే ఫ్రీగా ఉంటాడని, మిగతా సమయాల్లో చాలా రిజర్వ్ ఉంటాడని, అంతగా ఎవరితోనూ మాట్లాడడని తెలిపారు. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా విజయ్ ఒంటరిగా గడపడానికి ఇష్టపడతాడని శోభ వెల్లడించారు. తమ ప్రారంభ రోజుల్లో తన భర్త చంద్రశేఖర్ సినిమా రంగంపై పూర్తి దృష్టి పెట్టడం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారని, ఆ సమయంలో తాను పాటలు పాడటం ద్వారా వచ్చే సంపాదనతోనే ఇల్లు గడిచేదని శోభ గుర్తుచేసుకున్నారు. "ఆ రోజుల్లో మేము చాలా సాధారణ మధ్యతరగతి వాతావరణంలోనే విజయన్ను పెంచాము" అని ఆమె అన్నారు.
రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం..
తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడైన విజయ్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. మే 10 (ఆదివారం) నాడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు ఆయన నటించిన చివరి చిత్రం 'జననాయగన్' కొన్ని వివాదాల కారణంగా ఇంకా విడుదల తేదీని ఖరారు చేసుకోలేదు.






