- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' విజయాలను కేస్ స్టడీలుగా నమోదు చేయాలి '
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో సాధించిన విజయాలను కేస్ స్టడీల రూపంలో నమోదు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి, గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.

దిశ, ఖమ్మం బ్యూరో : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో సాధించిన విజయాలను కేస్ స్టడీల రూపంలో నమోదు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి, గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత జిల్లా అధికారులతో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి, జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం విజయగాథలను గుర్తించి నమోదు చేయడం పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి శాఖ తమ విజయాలు, సాధించిన ఫలితాలు, ఉత్తమ పద్ధతులు, ప్రజలకు కలిగిన ప్రయోజనాలను సంక్షిప్తంగా పొందుపరుస్తూ నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.ప్రతి శాఖ నివేదికలో స్పష్టమైన వివరాలు ఉండాలని, ఇతర జిల్లాల్లో అమలు చేయదగిన ఉత్తమ పద్ధతులను ప్రత్యేకంగా పేర్కోవాలని తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి ప్రస్తుత స్థితి, పరిష్కార వివరాలను కూడా నివేదికల్లో పొందుపరచాలని సూచించారు. పాలేరు నియోజక వర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, పరిష్కరించిన సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల వివరాలతో ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.జిల్లాలోని గురుకుల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకూడదని, నిరుపేదలు, అనాథలు,ఒంటరి తల్లిదండ్రుల పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ ఖాళీ సీట్లను భర్తీ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టీజీఎంఐడీసీ, మన ఇసుక వాహనం ద్వారా ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని, జిల్లాలో ఇసుక సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో నాణ్యమైన ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక కేటాయింపులు కూడా టీజీఎం ఐడీసీ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు.
99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై రూపొందించే బుక్‌లెట్‌లో ప్రతి శాఖ విజయ గాథలు, ఉత్తమ కేస్ స్టడీలు, థీమ్ వారీగా ఎంపిక చేసిన ఉత్తమ ఫొటోలను పొందుపరచాలని సూచించారు. బుక్‌లెట్ పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో బుక్‌లెట్ పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఖమ్మం జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు నిర్వహించిన పరిశుభ్రత, ఫైల్ క్లియరెన్స్ కార్యక్రమంలో 11,326 ఫైళ్లను పరిష్కరించామని తెలిపారు.
జిల్లాలోని 571 గ్రామాలు, 177 పట్టణ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.మాతృ మరణాల రేటును సున్నాకు తీసుకురావాలనే లక్ష్యంతో తల్లి ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.బాలల భద్రత వారోత్సవాలు నిర్వహించి అన్ని విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. వ్యవసాయ వారోత్సవాలు నిర్వహించి రైతు భరోసా, నానో యూరియా వినియోగం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, పంట అవశేషాల దహనం నివారణ, వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ పామ్ సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నేల ఆరోగ్య నిర్వహణ పై విస్తృత అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.






