SEBI: రిటైల్ ఇన్వెస్టర్లకూ 'డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్'

by S Gopi |

సాంకేతికత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, అవసరమైన రిస్క్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ తనిఖీలను కఠినంగా అమలు చేస్తూ, ఈ సరికొత్త ట్రేడింగ్ స్వేచ్ఛను అన్ని వర్గాల క్లయింట్లకు ఇవ్వవచ్చని సెబీ స్పష్టం చేసింది.

SEBI: రిటైల్ ఇన్వెస్టర్లకూ డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా సెబీ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం కేవలం సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ (డీఎంఏ) సదుపాయాన్ని అన్ని వర్గాల పెట్టుబడిదారులకు విస్తరించాలని సూచించింది. డీఎంఏ అంటే, ఏదైనా షేరును కొనాలన్నా, అమ్మాలన్నా మధ్యలో బ్రోకర్ 'డీలింగ్ డెస్క్' (మధ్యవర్తిత్వం)తో పనిలేకుండా, నేరుగా రిటైల్ ఇన్వెస్టర్లే ఎక్స్ఛేంజ్ సిస్టమ్‌లో ఆర్డర్లు పెట్టుకునే అత్యాధునిక సాంకేతిక సదుపాయం. సాంకేతికత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, అవసరమైన రిస్క్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ తనిఖీలను కఠినంగా అమలు చేస్తూ, ఈ సరికొత్త ట్రేడింగ్ స్వేచ్ఛను అన్ని వర్గాల క్లయింట్లకు ఇవ్వవచ్చని సెబీ స్పష్టం చేసింది.

కమోడిటీ మార్కెట్‌కూ విస్తరణ

షేర్ మార్కెట్‌తో పాటు కమోడిటీ డెరివేటివ్స్ (బంగారం, వెండి, చమురు వంటి వస్తువుల ట్రేడింగ్) మార్కెట్లోనూ ఈ డైరెక్ట్ యాక్సెస్ సదుపాయాన్ని విస్తరించాలని సెబీ భావిస్తోంది. 2023, మేలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు (ఎఫ్‌పీఐ) దీనికి అనుమతి ఇవ్వగా, ఇప్పుడు మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల (ఎంఐఐ) అభ్యర్థన మేరకు ఇతర ఇన్వెస్టర్లకూ దీన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో ఈ డీఎంఏ విధానానికి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) క్యాష్ మార్కెట్ విభాగంలో మే నెలలో డీఎంఏ వాటా 4.7 శాతానికి పెరిగి, తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. దీనికి భిన్నంగా మొబైల్, ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్స్ స్వల్పంగా మందగించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026, మే వరకు గల డేటా)లో మొబైల్ ట్రేడింగ్ 22.9 శాతంతో ఐదేళ్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేయడం విశేషం.

Next Story