పుకార్లకు చెక్..? సీఎం విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన త్రిష

by Ramesh Naini |

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్ 52వ పుట్టిన రోజు సందర్భంగా నటి త్రిష కృష్ణన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

పుకార్లకు చెక్..? సీఎం విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన త్రిష
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్ 52వ పుట్టిన రోజు సందర్భంగా నటి త్రిష కృష్ణన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. నిన్న పుట్టిన కావడంతో విజయ్‌కు ఆమె శుభాకాంక్షలు చెప్పకపోవడం, మరోవైపు ఆయనను అన్‌ఫాలో చేశారంటూ నెట్టింట గత రెండు రోజులుగా సాగిన తీవ్ర ప్రచారానికి, పుకార్లకు ఈ పోస్ట్‌తో తెరపడినట్లైంది. విజయ్‌తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఒక వ్యక్తిగత ఫోటోను నటి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘వీటన్నింటినీ విలువైన వాటిగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు (00.00)’ అని త్రిష పేర్కొన్నారు. జూన్ 22 అర్ధరాత్రి ‘00.00’ గంటలకే తాను మొదటగా శుభాకాంక్షలు తెలిపినట్లు ఆమె ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.

గంటలో 1 మిలియన్‌కు పైగా లైక్స్!

‘గిల్లి’, ‘తిరుపాచ్చి’, ‘లియో’ వంటి విజయవంతమైన చిత్రాలలో కలిసి నటించిన వీరిద్దరి ఆన్‌స్క్రీన్ జోడీకి, స్నేహానికి కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కేవలం ఒక గంటలో పోస్టుకు 1 మిలియన్‌కు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు కామెంట్స్‌తో షేక్ చేస్తున్నారు. పుకార్లకు చెక్ పెట్టారా..? వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి..? అని అయోమయానికి గురవుతూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.

సీఎం హోదాలో మొదటి పుట్టినరోజు

కాగా, నటుడిగా ఉంటూ 2024లో ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని స్థాపించిన విజయ్, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. అనంతరం మే నెలలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం హోదాలో విజయ్ జరుపుకున్న మొదటి పుట్టినరోజు ఇదే కావడం విశేషం. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కమల్ హాసన్, మోహన్‌లాల్, రాఘవ లారెన్స్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story