అప్పుల్లో సింగరేణి.. నిధులతో సీఎం సోకులు : మాజీ మంత్రి హరీష్ రావు

by Batti.Sumithra |

ప్రభుత్వ అసమర్థ తీరుతో సింగరేణి సంస్థ ప్రస్తుతం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉప నేత హరీష్ రావు ఆరోపించారు.

అప్పుల్లో సింగరేణి.. నిధులతో సీఎం సోకులు : మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : ప్రభుత్వ అసమర్థ తీరుతో సింగరేణి సంస్థ ప్రస్తుతం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందని మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉప నేత హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సమితి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో జరిగిన అవినీతి పై కార్మికులకు, ఉద్యోగులకు ' పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ' ద్వారా స్పష్టంగా వివరించారు. సింగరేణిలో గతంలో ఎన్నడూ లేని విధంగా టెండర్ కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకువచ్చి కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన అనునాయులకు టెండర్లు కట్టబెట్టడం కోసమే ఈ విధానం తెచ్చారని ధ్వజమెత్తారు. డీజిల్ , బొగ్గు గనుల్లో తీయని బొగ్గు తీసినట్లుగా చూపడం, ధర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ ల నిర్మాణంలో అవినీతి జరిగిందని లెక్కలతో సహా వివరించారు. గత 30 ఇండ్లలో ఎప్పుడూ నష్టాలు రాని సింగరేణి ప్రస్తుతం నష్టాల్లో ఉందని ఇదంతా కాంగ్రెస్ చలువే అని, సింగరేణి సంస్థలో సీఎం, ఎమ్మెల్యే, మంత్రులు ఉద్యోగుల బదిలీలు, టెండర్లు, పాలసీ విషయాలలో విపరీతంగా జోక్యం పెరిగిపోయిందని అందుకే అవినీతి మయంగా మారిందని విమర్శించారు.

సంస్థను కాంగ్రెస్ క హస్తాల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికుల పై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలను తీసేస్తే, బీ ఆర్ ఎస్ వచ్చాక వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి కార్మికుల పిల్లలను డాక్టర్లను చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి గొప్పలకు పోయి సంస్థను దివాలా తీస్తున్నారని, సింగరేణి సొమ్ముతో ఫుట్బాల్ ఆడి వృధా ఖర్చు చేశాడని మండిపడ్డారు. ప్రస్తుతం సంస్థ రూ.4,300 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని ఇది ఇలాగే కొనసాగితే రాను రాను కార్మికులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టతరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బ్యాంకులు సంస్థ చుట్టూ డిపాజిట్ చేసుకోవడం కోసం తిరిగేవని, కానీ ఇప్పుడు అప్పుల కోసం అధికారులు, నాయకులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

సంస్థను, కార్మికలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బావుల మీద బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెపుతున్నారని, బొగ్గు బావుల వద్దకు వెళ్లి బొగ్గు ఉందో లేదో చూడాలని, కార్మికుల పక్షాన ఉంటావో, కాంగ్రెస్ పక్షాన ఉంటావో తేల్చుకోవాలని హితవు పలికారు. ఈ సదస్సులో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి, కార్యదర్శి కాపు కృష్ణ, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ రెడ్డి, మాజీ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ, కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ కార్పొరేటర్లు, సర్పంచ్ లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు , ఎంపీటీసీలు, సింగరేణి ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Next Story