పాతబస్తీలో షాకింగ్ చోరీ.. ATM క్యాష్ వ్యాన్ డ్రైవర్ రూ.17 లక్షలతో పరార్ !

by Batti.Sumithra |

హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం రేపిన చోరీ ఘటన చోటుచేసుకుంది.

పాతబస్తీలో షాకింగ్ చోరీ.. ATM క్యాష్ వ్యాన్ డ్రైవర్ రూ.17 లక్షలతో పరార్ !
X

దిశ, చంపాపేట్ : హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం రేపిన చోరీ ఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలో నగదు నింపే ప్రైవేట్ క్యాష్ వ్యాన్‌కు చెందిన డ్రైవర్, ట్రంక్ బాక్స్‌లో ఉన్న రూ.17 లక్షల నగదును అపహరించి పరారైన ఘటన రాయింబజార్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారి పై వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీఎమ్ లకు నగదు సరఫరా చేసే ప్రక్రియలో భాగంగా వ్యాన్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, డ్రైవర్ ముందస్తు ప్రణాళికతో నగదు ఉన్న ట్రంక్ బాక్స్‌ను తీసుకుని ద్విచక్ర వాహనం పై అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. నగదు మాయమైన విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

ఈ ఘటన పై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడి కదలికలను విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన ATM నగదు రవాణా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ విధానాల పై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Next Story