బీఆర్ఎస్ నాయకులకు చదువు రాదు.. చెప్తే అర్థం చేసుకోరు...

by Ratna Kumari |

బీఆర్ఎస్ నాయకులకు చదువు రాదు.. చెప్తే అర్థం చేసుకోరు...కానీ ధర్నా చేసి రైతులను రెచ్చగొడుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆరోపించారు.

బీఆర్ఎస్ నాయకులకు చదువు రాదు.. చెప్తే అర్థం చేసుకోరు...
X

దిశ, కామారెడ్డి : బీఆర్ఎస్ నాయకులకు చదువు రాదు.. చెప్తే అర్థం చేసుకోరు...కానీ ధర్నా చేసి రైతులను రెచ్చగొడుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్, ఆయన ఎమ్మెల్యేలు యూరియా పేరుతో రైతుల మీద పడ్డారని విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని సొసైటీలకు యూరియా సరఫరా అయిందన్నారు. కొంతమంది పీఏసీఎస్ చైర్మన్లుగా కొనసాగుతూ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే వారు డీడీలు కట్టకుండా యూరియా రాకుండా చేసి రైతులను ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వాన్ని బధనాం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మీ డేటా అంతా మా దగ్గర ఉందని, ఒక్కొక్కరిని లోపల వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా రైతులను రెచ్చగొడుతూ సోషల్ ఎలిమెంట్ యాక్ట్ కింద ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే కావాలని అనుకుంటే అది కల మాత్రమే అవుతుందన్నారు. యాప్ లో టెక్నాలజీ ద్వారా రైతులకు యూరియా అందించాలని ప్రభుత్వం ఆలోచించిందన్నారు. మధ్యలో బ్రోకర్లుగా ఉండి, కమిషన్లు తీసుకుంటూ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు అమ్ముకుని, దానిమీద రూ.30 సంపాదించిన రోజులు ఉన్న విషయం మాకు తెలుసన్నారు. మీ లెక్కలు తీస్తే మీరు కటకటాల లోపలికి వెళ్తారని పేర్కొన్నారు. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న వాటిని నమ్మి రైతులు బలికావద్దని కోరారు. యూరియా యాప్ లో సాంకేతిక సమస్యలున్న మాట వాస్తవమేనని, కొన్ని చోట్ల నెట్ వర్క్ సమస్య ఉండి ఇబ్బంది అవుతోందన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వేలాదిగా కట్టించి లబ్ధిదారులకు ఇస్తున్నామని, కేటీఆర్.. మీ పదేళ్ల పాలనలో ఎన్ని వేల ఇండ్లను నిర్మించి ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం వచ్చినట్టు.. మీరే సీఎం అయినట్టు ఫీలయితున్నావ్.. రెండేల్లే అయింది కదా.. ఎందుకంత ఆగం అవుతున్నావ్.. అన్నారు. డీసీసీ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని, రైతుల సమస్యలు ఉంటే నేరుగా వచ్చి చెప్పవచ్చన్నారు. ముందస్తు అరెస్టులు చేయాలని ప్రభుత్వ విధానం కాదని, ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం పోలీసులే ఆ విషయాన్ని చూసుకుంటారన్నారు. ధర్నాలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉంటేనే ఇబ్బందవుతుందన్నారు.

పార్టీ కార్యాలయ నిర్మాణానికి చందాలు వసూలు చేస్తే చర్యలు...
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు

140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకపోవడం విచారకరమని, అది ఎందుకో మాకైతే తెలియదని, డీసీసీ అధ్యక్షునిగా ఏలే మల్లికార్జున్ కొత్తగా ఎన్నికైన తర్వాత పార్టీలో నిజాయితీగా, నిబద్ధతగా ముందుకు వెళ్తున్నాడని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే, మంత్రి, కార్యకర్తలు అందరూ సమానమేనన్నారు. మల్లికార్జున్ వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇక్కడ పార్టీ కార్యాలయం ఉండాలని ఉన్నతమైన ఆలోచనతో రాత్రింబవళ్లు కష్టపడి ఇద్దరు ఎమ్మెల్యేలమైన మేము, ఇతర నాయకుల కృషితో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ముందడుగు పడిందన్నారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం ఎకరం స్థలం కూడా కేటాయించిందన్నారు. దానికి మినిమం ఫీజు రూ.4.80 లక్షలు చెల్లించాలి అంటే ఇద్దరం ఎమ్మెల్యేలం కలిసి చెల్లించామన్నారు. ఎవరైనా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసమని, స్థలం కోసమని చందాలు, విరాళాలు చేయవద్దని సూచించారు. ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువవుతోందని రైతుల విషయంలో ప్రభుత్వం ఏనాడు నిర్లక్ష్యం చేయలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా 174 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 48 గంటల లోపు ధాన్యం డబ్బులను రైతుల ఖాతాలో వేసింది తమ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. కేంద్రం జొన్న పంటను కొనలేమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి బీజేపీ మొండి వైఖరే కారణమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో కంటే 40 శాతం ఎక్కువగా రాష్ట్రంలో పంటసాగు జరిగిందన్నారు. రామగుండం లేదా చైనా నుంచి యూరియా దిగుమతి చేసుకోవాలని, యూరియా దిగుమతి కాకపోవడానికి ఎవరు కారణమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతలా యూరియా కొరత లేదంటే స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. మోడీతో కొట్లాడి అయినా రైతులకు యూరియా సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ కుమార్, సేవాదళ్ అధ్యక్షుడు గడ్డమీది మహేష్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, అంకం నాగరాజు గౌడ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story