- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఇంట్లో రెండుసార్లు ఆగిపోయిన చిన్నారుల నవ్వులు
ఒక చిన్నారి మరణం కుటుంబాన్నే కాదు... ఓ వీధిని, ఓ పాఠశాలను, ఆమెతో కలిసి పెరిగిన స్నేహితులను విషాదంలో ముంచెత్తింది.

దిశ, ఖమ్మం రూరల్ : ఒక చిన్నారి మరణం కుటుంబాన్నే కాదు... ఓ వీధిని, ఓ పాఠశాలను, ఆమెతో కలిసి పెరిగిన స్నేహితులను విషాదంలో ముంచెత్తింది. 14 ఏళ్ల క్రితం ఒక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు... ఇప్పుడు మరో కుమార్తెను కూడా కోల్పోవడంతో విషాదం రెట్టింపైంది. ఎదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్–స్రవంతి దంపతులకు జన్మించిన కవల ఆడపిల్లల్లో ఒకరు పసిప్రాయంలోనే పేగు సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. అదే సమస్యతో బాధపడుతున్న మరో కుమార్తె **వైదిక**ను తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు భరిస్తూ, వైద్య చికిత్సలు అందిస్తూ 14 ఏళ్ల పాటు సంరక్షించారు. అయితే చికిత్స పొందుతూ వైదిక కూడా కన్నుమూసింది. ఒకే వ్యాధితో ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన స్థానికులను కంటతడి పెట్టించింది.
చివరి చూపు కోసం ఎదురుచూసిన సహపాఠులు..
ఏదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వైదిక అందరితో కలిసిమెలిసి ఉండే విద్యార్థిని. ఆమె అంతిమయాత్ర పాఠశాల సమీపానికి వస్తోందని తెలుసుకున్న సహపాఠులు సాయంత్రం వరకు పాఠశాల ఎదుటే వేచి ఉన్నారు. అంతిమయాత్ర వాహనం కనిపించగానే విద్యార్థులు పరుగెత్తుకుంటూ వెళ్లి తమ స్నేహితురాలికి కడసారి వీడ్కోలు పలికారు. చివరిసారిగా ఆమె ముఖాన్ని చూసిన క్షణంలో పలువురు విద్యార్థులు బోరున విలపించారు. ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన ఉపాధ్యాయులు, స్థానికులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, వైదిక ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నివాళులర్పించారు.






