భూ రీ-సర్వేను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.

భూ రీ-సర్వేను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి
X

దిశ, తిరుమలాయపాలెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పట్టాదారు భూమిని సంబంధిత భూ యజమానులు, రైతుల సమక్షంలోనే సర్వే చేసి సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. భూ రీ-సర్వేపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్న కలెక్టర్, గ్రామస్థులు అడిగే ప్రతి సందేహానికి వెంటనే సమాధానం ఇచ్చి వారిలో విశ్వాసం కల్పించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ భూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో నాణ్యమైన సర్వే నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భూ రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రైతులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి రైతు తన భూమికి సంబంధించిన ఖచ్చితమైన రికార్డులు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలంలో సీతారామ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ లూథర్ విల్సన్, ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ సుధీర్, సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story