- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్తెలు దాటిపోతున్న కానరాని వర్షాలు
కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో పడ్డారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. రోహిణి, మృగశిర కార్తెలు ముగిసి ఆరుద్ర కార్తె కూడా దాటిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
మొలకెత్తని పత్తి, మొక్కజొన్న విత్తనాలు..
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు వర్షం కోసం ఎదురుచూస్తూ ముందస్తుగా పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. ఆశగా దుక్కులు దున్ని విత్తనాలు చల్లినా చినుకు జాడ లేకపోవడంతో నేలలో విత్తనాలు అలాగే ఉండిపోయాయి. భూమిలో తేమ లేక దుక్కులు ఎండిపోయి నెర్రెలు వారుతున్నాయి. దీంతో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పంటలపై అనాసక్తి...
వర్షాలు ఆలస్యమవుతుండడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే కంది, మొక్కజొన్న, ఆముదం, జొన్న, పత్తి వంటి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పత్తి, మొక్కజొన్నకు ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు మళ్లీ వేరే పంటలు వేయడానికి జంకుతున్నారు. రెండోసారి విత్తనాలు, ఎరువులు కొనాలంటే పెట్టుబడి రెట్టింపు అవుతుందని, అప్పులు పెరిగిపోతాయని భయపడుతున్నారు. దిగుబడి వస్తుందో లేదోననే అనుమానంతో ప్రత్యామ్నాయ పంటల జోలికి వెళ్లడం లేదు.
జిల్లాలో తగ్గిన వర్షపాతం..
జిల్లాలో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 108 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా, కేవలం 81 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 25% వర్షపాతం తక్కువగా కురిసింది. జూన్ నెలలోనే ఈ లోటు ఏర్పడటంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. చెరువులు, కుంటలు, బోర్లలో నీటిమట్టం పడిపోవడంతో వరి నాట్లకు కూడా నీరు అందడం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు బోర్లపై ఆధారపడే పరిస్థితి లేకుండా పోయింది.
జిల్లాలో సాగు చేస్తున్న పంటల వివరాలు..
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో మొత్తం 5.65 లక్షల ఎకరాలలో వివిధ పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 5.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా వరి 3.20 లక్షల ఎకరాలు, పప్పు దినుసులు 52,500 ఎకరాలు, మొక్కజొన్న 48,200 ఎకరాలు, పత్తి 46,500 ఎకరాలలో పంటల సాగు కొనసాగుతోంది. వరి సాగు అత్యధికంగా 3.20 లక్షల ఎకరాల్లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వర్షాలు లేక చెరువులు, కుంటలు నిండకపోవడంతో వరి నాట్లు కూడా ఆలస్యమవుతున్నాయి.
వర్షం కోసం అన్నదాతల ఎదురుచూపులు...
వారం రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలు దక్కుతాయని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు దాటిపోయినా చినుకు జాడ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు వరుణదేవుడి కోసం ఆకాశం వైపు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. పెట్టుబడి దండగై అప్పుల పాలవుతామేమోనని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి..
మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి..
ఈ పరిస్థితులపై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. "వర్షపాతం సాధారణం కంటే 27 మి.మీ. తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు అధిక పెట్టుబడి, అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలి. ఇప్పటికే విత్తిన చోట మొలకెత్తకపోతే మళ్లీ అవే పంటలు వేయకుండా, తక్కువ వ్యవధిలో, తక్కువ నీటితో వచ్చే కంది, జొన్న, ఆముదం, కొర్ర వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. జిల్లాలో సూక్ష్మ సేద్య పరికరాలు ఉన్న రైతులు వాటిని వినియోగించుకోవాలి. వ్యవసాయ శాఖ రైతులకు అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరంగా పెట్టుబడి పెంచుకోవద్దు" అని సూచించారు.






