- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానలు కురవాలని కప్పతల్లి ఆట.. ప్రకృతి దేవతలకు మొక్కిన పల్లె రైతులు
వర్షాలు కురవాలని కోరుకుంటూ కర్ర మధ్యలో కప్పను బట్టలో కట్టి ఇద్దరు కావడిలా మోస్తూ గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ వరుణదేవుడిని వేడుకునే "కప్పతల్లి ఆట"తో లక్ష్మీపూర్ గ్రామం ఆదివారం సందడిగా మారింది.

దిశ, జగిత్యాల ప్రతినిధి : వర్షాలు కురవాలని కోరుకుంటూ కర్ర మధ్యలో కప్పను బట్టలో కట్టి ఇద్దరు కావడిలా మోస్తూ గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ వరుణదేవుడిని వేడుకునే "కప్పతల్లి ఆట"తో లక్ష్మీపూర్ గ్రామం ఆదివారం సందడిగా మారింది. అనాదిగా కరువు వేళల్లో వర్షాలను ఆహ్వానించే విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పల్లె సంస్కృతి తాజా ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల ఆలస్యం నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున కప్పతల్లి ఆట నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లిన రైతులు కప్పతల్లిని కావడిలా మోస్తున్న ఇద్దరి పై ప్రతి ఇంటి వద్ద నీళ్లు పోస్తూ వర్షాలు కురవాలని ప్రార్థించారు.
మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రకృతి దేవతలను ఆరాధించారు. కప్పతల్లి ఆటకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా తమ తాతముత్తాతల కాలం నుంచి కరువు వచ్చినప్పుడు వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని స్థానిక రైతులు తెలిపారు. అయితే ఊరేగింపు తర్వాత కప్పను సురక్షితంగా ప్రకృతి ఒడిలో వదిలేశారు. ఇదిలా ఉండగా ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన పెరిగింది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న తమకు సకాలంలో వర్షాలు కురవకపోతే తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం సాగునీటి వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు.






