కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం

by Ratna Kumari |

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
X

దిశ, హుజూర్‌నగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్‌నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు తొలగించి కాళేశ్వరం పేరు పెట్టడం కూడా అదే ఉద్దేశంతో జరిగిందని మంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గతంలో రూ.1,400 కోట్ల కమిషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావును వారి సొంత పార్టీ నాయకత్వమే పక్కన పెట్టిందని, తమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. మట్టి పరీక్షలు, సాంకేతిక నిపుణుల సూచనలను పట్టించుకోకుండా ఇసుక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు, ఇతర సాంకేతిక నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ అప్పటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారులు సూచించిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం వెనుక కమిషన్ల కోణం ఉందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం డ్యామ్‌లో నీటిని నిల్వ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లాకు ప్రస్తుతం ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా నీరు అందుతోందని, కాళేశ్వరం నుంచి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నుంచి ఒక్కసారి కూడా నీటిని విడుదల చేయలేదన్నారు. తెలంగాణను అప్పులపాలు చేసి, ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి అన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు అవసరమైన మట్టి పరీక్షలు నిర్వహించి, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన పనులు చేపడతామని తెలిపారు.

Next Story