భారత్‌కు ముందస్తు వేసవి ముప్పు.. మార్చి నుండే తెలంగాణలో నిప్పుల కొలిమి!

by Muthe.Rajitha |

ఈ ఏడాది భారత్ లోని అన్ని రాష్ట్రాలు తీవ్రమైన ఎండలను ఎదుర్కోవాల్సి వస్తుందని IMD హెచ్చరించింది. మార్చ్ మొదటి వారం ముంచే హీట్ వేవ్ మొదలవుతుందని వార్నింగ్ బెల్స్ మోగించింది.

భారత్‌కు ముందస్తు వేసవి ముప్పు.. మార్చి నుండే తెలంగాణలో నిప్పుల కొలిమి!
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం ఈ ఏడాది అత్యంత కఠినమైన వేసవిని ఎదుర్కోబోతోందని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే ఎండల తీవ్రత, ఈ ఏడాది మార్చి మొదటి వారం నుండే మొదలుకానుందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో బలహీనపడుతున్న 'లా నినా' పరిస్థితులు, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న 'ఎల్ నినో' ప్రభావం వల్ల ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదు కానున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉండటం ఈ ముప్పుకు సిగ్నల్ లాగ కనిపిస్తోంది.

ఉత్తర భారతం.. నిప్పుల కొలిమి

ఈ సమ్మర్ ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతంలో నిప్పుల కొలిమిని తలపించనుంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ తోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి నెలలో ఉష్ణోగ్రతలు 40°C నుండి 42°C వరకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల రబీ పంటలు (ముఖ్యంగా గోధుమలు) గింజ ముదిరే దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇది దేశ ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడటం వల్ల వడగాల్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంది.

దక్షిణ భారతం.. ఎండ + ఉక్కపోత

అయితే ఈసారి సౌత్ ఇండియాలో పరిస్థితి మరింత భిన్నంగా ఉండబోతోందని IMD అంచనా వేస్తోంది. ఇక్కడ కేవలం ఎండ మాత్రమే కాకుండా, సముద్రపు తేమ వల్ల కలిగే తీవ్రమైన 'ఉక్కపోత' ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. బెంగళూరు వంటి చల్లని నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు 35°C దాటవచ్చని సమాచారం. తీర ప్రాంతాలైన కేరళ, తమిళనాడులో ఉష్ణోగ్రతలు 38°C ఉన్నప్పటికీ, తేమ కారణంగా 44°C ఉష్ణోగతను తలపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలోని రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి లోనవుతాయి. ఇక్కడ మార్చి మధ్య నాటికే ఉష్ణోగ్రతలు 41°C దాటవచ్చునని సమాచారం.

తెలంగాణలోనూ భగభగలు

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మార్చి 2 నుండే భానుడు ప్రతాపం చూపించనున్నాడని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వేసవిలో అత్యంత వేడి ప్రాంతంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఐఎండీ హైదరాబాద్ కేంద్రం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం. మార్చి 2 నుండి మార్చి 7 వరకు రాష్ట్రం మొదటి విడత హీట్ వేవ్ ను ఎదుర్కోబోతోందని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారంలోనే 40°C మార్కును తాకవచ్చునని అంచనా వేస్తున్నారు అధికారులు. అంతేకాదు తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పలు రాష్ట్రాలు భారీ నీటి ఎద్దడిని ఎదుర్కోనున్నాయి. ఈ అసాధారణ వేడిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 'హీట్ యాక్షన్ ప్లాన్'ను అమలు చేస్తున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగినంత నీరు మరియు ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story