- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే పెళ్లి.. శుభలేఖలు పంచేందుకు వెళ్లి పెళ్ళికొడుకు మాయం!
పెళ్లి పత్రికలు పంచి తిరిగి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన పెళ్లి కొడుకు.. పెళ్లికి కేవలం రెండు రోజుల ముందు అదృశ్యమైన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది.

దిశ, నవాబుపేట: పెళ్లి పత్రికలు పంచి తిరిగి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన పెళ్లి కొడుకు.. పెళ్లికి కేవలం రెండు రోజుల ముందు అదృశ్యమైన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఆదివారం జరగాల్సిన వివాహానికి పెళ్లి కూతురు ఇంటి వద్ద ఇప్పటికే పందిరి సిద్ధమై, బంధుమిత్రులు పెళ్లి ఇల్లు వద్దకు చేరుకుంటున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం రెండు కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన చింతకింది రఘురాములుకు హైదరాబాద్‌కు చెందిన రోజాతో ఐదు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది.
ఈ నెల 5న వారి పెళ్లికి ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు(ఆదివారం) పెళ్లి జరగాల్సి ఉంది. గురువారం ఉదయం బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు జడ్చర్లకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన పెళ్ళికొడుకు రఘురాములు అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అంతేకాక ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన కోసం అన్ని చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దాంతో ఆయన సోదరుడు విజయ్ కుమార్ శుక్రవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడి ఆచూకీ కనుగొని పెళ్లి వేడుక నిరాటంకంగా కొనసాగేలా చూడాలని విజయ్ కుమార్ పోలీసులను వేడుకున్నారు.
విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వాకిటి నరేందర్ తెలిపారు. పెళ్లి ముహూర్తం సమీపిస్తుండగా పెళ్లి కొడుకు అదృశ్యం వెనుక ఏదైనా మిస్టరీ దాగి ఉందా? లేక మరేదైనా అనూహ్య పరిణామమా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పెళ్లి ముహూర్తం సమయానికైనా పెళ్ళికొడుకు రఘు రాములు ఇంటికి చేరుకుని పెళ్లి పీటలను ఎక్కి పెళ్లి కూతురు రోజా మెడలో మంగళసూత్రం కట్టి పెళ్లి నిరాటంకంగా జరిగేలా చేస్తాడా లేక పెళ్లి కొడుకు అదృశ్యం మిస్టరీగా మారి పెళ్లి పెటాకులవుతుందా అనే ఉత్కంఠత గ్రామస్తులు బంధుమిత్రులందరిలో నెలకొంది.పెళ్లి ముహూర్తం వరకు ఈ విషయంలో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఉత్సుకత ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే.






