‘మిడ్జిల్ నుంచి మీ గుండెల్లో రేవంతన్న దాకా..’ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 వసంతాలు పూర్తి చేసుకున్నారు.

‘మిడ్జిల్ నుంచి మీ గుండెల్లో రేవంతన్న దాకా..’ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన రెండు దశాబ్దాల ప్రజా జీవితాన్ని నెమరువేసుకుంటూ శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఆయన ఒక ఆసక్తికరమైన, భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మధుర జ్ఞాపకం.. ఈ ప్రజా జీవితం

‘లక్షల అక్షరాలతో రాసినా... కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం’ అని సీఎం రేవంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నాడు మిడ్జిల్‌లో సాధారణ ‘రేవంత్ రెడ్డి’గా మొదలైన తన రాజకీయ ప్రయాణం, నేడు తెలంగాణ ప్రజలందరి గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచే వరకు సాగడం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని ఆయన అభివర్ణించారు.

పోరాటంలో తోడుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు

ఈ ఇరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురయ్యాయని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో తనతో నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనతో కలిసి నడిచిన ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు రాజకీయ కార్యకర్తలకు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా ముందుకెళ్తా..

గత 20 ఏళ్లుగా చూపించిన అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందుకు సాగుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, వారి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో ‘తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా’, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. అన్నింటికీ మించి అందరి ‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు అప్పటి ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

Next Story