కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్.. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు మార్చుకోవాల్సిందేనన్న ఈసీ..!

by Malleboina Mahesh |

కవిత కొత్త పార్టీ 'తెలంగాణ రక్షణ సేన' పేరు మార్చాలని ఈసీ ఆదేశం.. ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో 15 రోజుల్లోగా 3 కొత్త పేర్లు ఇవ్వాలని గడువు!

కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్.. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు మార్చుకోవాల్సిందేనన్న ఈసీ..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడుపోసుకున్న ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ పేరు పై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి 'తెలంగాణ రక్షణ సేన' (TRS) గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాశారు. రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించక పోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ గడువు విధించినట్లు తెలుస్తోంది.

ఆ అభ్యంతరాలే కారణం..

గతంలో కేసీఆర్ నేతృత్వంలోని 'తెలంగాణ రాష్ట్ర సమితి' పార్టీ కూడా 'టీఆర్ఎస్' (TRS) అనే సంక్షిప్త నామంతోనే గుర్తింపు పొందింది. ఆ తర్వాత దానిని భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే సంక్షిప్త నామం (TRS) వచ్చేలా 'తెలంగాణ రక్షణ సేన' అని పేరు పెట్టడం పై ప్రజల నుండి, వివిధ వర్గాల నుండి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. పాత పార్టీ పేరును, సెంటిమెంట్‌ను తలపించేలా ఈ కొత్త పేరు ఉండటం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పేరును కొనసాగించడం కుదరదని స్పష్టం చేస్తూ, కవితకు పంపిన లేఖలో ఈసీ ఈ విషయాలను పొందుపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story