గ్రామపంచాయతీయే గ్రామాభివృద్ధికి మూలం

by Ratna Kumari |

గ్రామపంచాయతీయే గ్రామాభివృద్ధికి మూలమని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

గ్రామపంచాయతీయే గ్రామాభివృద్ధికి మూలం
X

దిశ, కామారెడ్డి రూరల్ : గ్రామపంచాయతీయే గ్రామాభివృద్ధికి మూలమని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా జిల్లాలోని మూడు డివిజన్ల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27, 2027–28, 2028–29 సంవత్సరాలకు గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రజల భాగస్వామ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సహకారంతో రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన, నిధుల పారదర్శక వినియోగం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీబీజీ రామ్‌జీ (VBG Ramji) పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను పారదర్శకంగా వినియోగించడంతో పాటు గ్రామపంచాయతీలు స్వంత ఆదాయ వనరులను పెంపొందించుకుని 10 శాతం పనితీరు (పర్ఫార్మెన్స్) గ్రాంట్ పొందేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో తొలి 10 స్థానాల్లో నిలిచిందని, రెండో విడతలో గుడిసెలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు సహకరించాలని కోరారు. అలాగే 'బడిబాట' కార్యక్రమంలో జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి మొదటి స్థానానికి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా ఈ శిక్షణలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎన్.వై. గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా పంచాయతీ అధికారి మురళి, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story