ప్రజలతో మమేకమై సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

by Ratna Kumari |

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి గ్రామాల్లోనే సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) అన్నారు.

ప్రజలతో మమేకమై సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి గ్రామాల్లోనే సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట'** కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో ఎమ్మెల్యే రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, యువత, గ్రామ పెద్దలతో సమావేశమై తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలపై చర్చించారు.

ప్రజలు నేరుగా వెల్లడించిన సమస్యలను అధికారుల సమక్షంలో నమోదు చేయించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోనే రాత్రి బస చేసిన ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తూ వారి జీవన పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. శుక్రవారం ఉదయం నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే వీఓ భవనాన్ని ప్రారంభించి మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..'ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట' కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, గ్రామాల్లోనే సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం. చిల్లాపురం గ్రామ ప్రజలు సూచించిన ప్రతి సమస్యను ప్రాధాన్యంతో పరిష్కరిస్తాం. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు స్కైలాబ్ నాయక్, గ్రామ సర్పంచ్ మచ్చ మధు, ఎంపీడీవో శ్రీనివాస్ శర్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు, యువకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story