- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ అధికారులకు సర్కార్ స్వేచ్ఛనివ్వడం లేదు: బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
ఆ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి..
రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన విధంగానే సిట్ అధికారులు వ్యవహరించాలని ఒత్తిడి పెరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. సిట్‌లోని అధికారులు చాలా సిన్సియర్, పవర్‌ఫుల్ అని, వారి మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కానీ కేసు విచారణలో వారికి ఎంత స్వేచ్ఛనిచ్చారనే దానిపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. అసలు ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్‌లు అందరి ఫోన్లను ట్యాపింగ్ చేశారని విచారణకు పిలిచారా.. లేక వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని విచారిస్తున్నారా.. అనే విషయాన్ని సిట్ అధికారులు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ దందాకు తెరలేపారని ఆక్షేపించారు. కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందని.. ట్యాపింగ్‌కి భయపడి ఓ ఏడాది హరీష్ రావు, కవిత దంపతులు కూడా ఫోన్లు వాడలేదన్నారు. కేసీఆర్ హయాంలో బిచ్చగాళ్లు కూడా.. వాట్సాప్ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ కేసులో తనకు కూడా సిట్ నోటీసులు ఇచ్చి వాంగ్మూలం తీసుకుందని బండి సంజయ్ అన్నారు.
అది జగమెరిగిన సత్యమే.. కదా!
ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖ బిజినెస్‌మెన్లు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, జడ్జీలు బాధితులనేది జగమెరిగిన సత్యమే కదా అని అన్నారు. కేసీఆర్ కుటుంబమే ఫోన్లు ట్యాప్ చేయించిందని తెలిసినా.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ధైర్యం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సిట్ విచారణను ఎలా నమ్మమంటారు? ఇప్పటివరకు ఏం సాధించారో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుధంగా వాడుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు.






