ప్రాణహిత పుష్కరాలపై చిన్నచూపు.. పక్కా రాష్ట్రంలో నిధులు ఫుల్.. ఇక్కడ నిల్!

by Disha Web |
ప్రాణహిత పుష్కరాలపై చిన్నచూపు.. పక్కా రాష్ట్రంలో నిధులు ఫుల్.. ఇక్కడ నిల్!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్/మ‌హ‌దేవ్‌పూర్‌: ప‌న్నెండోళ్లకోసారి వ‌చ్చే ప్రాణహిత పుష్కరాల‌పై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా జ‌ర‌గ‌నున్న ప్రాణ‌హిత‌ పుష్కరాల‌ను ప్రభుత్వం పెద్దగా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈనెల 13 నుంచి 24వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న పుష్కరాల‌కు ప్రభుత్వం ప్రత్యేకంగా చిల్లిగ‌వ్వ కేటాయించ‌క‌పోవ‌డం భ‌క్తుల‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010లో జ‌రిగిన ప్రాణ‌హిత పుష్కరాల‌కు అప్పటి ప్రభుత్వం రూ.9.5కోట్లకు పైగా కేటాయించింది. ఇక తెలంగాణ ఆవిర్భవించాక జ‌రుగుతున్న తొలి పుష్కరం కావ‌డంతో ఈ సారి పెద్ద ఎత్తున నిర్వహిస్తార‌న్న అంచ‌నాలు నెల‌కొన‌గా.. ప‌లుమార్లు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో స‌మీక్షలు, ప్రతిపాద‌న‌ల హ‌డావుడి కూడా జ‌రిగింది. అయితే పుష్కరాల‌కు కేవ‌లం మూడు రోజుల స‌మ‌యం మాత్రమే ఉన్నా.. ప‌లుమార్లు మార్చి పంపిన త‌క్కువ మొత్తంలోని కేటాయింపుల‌కు ప్రభుత్వం ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాళేశ్వరంలో అర‌కొర‌గా ఏర్పాట్లు..

త్రివేణి సంగమం, ముక్తీశ్వరాల‌యంతో ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో ఏర్పాట్లపై ప్రభుత్వం ఉదాసీన‌త‌గా వ్యవ‌హ‌రించింద‌నే చెప్పాలి. కేవ‌లం 4కోట్లు ఇవ్వాల‌ని అడిగినా ఇంత వ‌ర‌కు ప్రభుత్వం నుంచి స‌మాధానం లేక‌పోవ‌డంతో ఐదు రోజుల క్రితం క‌లెక్టర్ భ‌వేష్ మిశ్రా రూ.49ల‌క్షల‌తో తాత్కాలిక ప‌నులు చేప‌ట్టేలా ఇరిగేష‌న్‌, ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ద్వారా రూ.35 లక్షలతో 110 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 40, వీఐపీ ఘాట్ వద్ద 10, బృహత్ పల్లె ప్రకృతి వనం పార్క్ వద్ద పార్కింగ్ స్థలంలో 20, హరిత హోటల్ సమీపంలో 20, శ్మశాన వాటిక పార్కింగ్ స్థలం వద్ద 20 మ‌రుగుదొడ్లను నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యార్థం రెండు వేల లీటర్లు గల ట్యాంకులు 10 ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఏర్పాటు చేసిన 15 ట్యాంకులను రిపేరు చేసి అందుబాటులోకి తేనున్నారు. గోదావరి, ఆలయ పరిసర ప్రాంతాల్లో నల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.14 లక్షలతో ప్రధాన పుష్కర ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు వీలుగా బ్యాట‌రీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున భక్తులకు చలువ పందిళ్ళు, టెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్రాణహిత పుష్కరాలను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పుష్కరాల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు రూ.10 కోట్లను కేటాయించింది. గడ్చిరోలి జిల్లా నగరం గ్రామం వద్ద పుష్కర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన పది కోట్లతో రహదారుల విస్తరణ, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, తాగునీరు, పార్కింగ్ స్థలాలు, విద్యుత్ దీపాలు, హెలిప్యాడ్లు, లాంటి పనులను ముమ్మరం చేస్తున్నారు.

కాళేశ్వరం ఘాట్‌కే ల‌క్షలాది భ‌క్తజ‌నం వ‌చ్చే అవ‌కాశం..

మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది తెలంగాణలో కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద కలుస్తుంది. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం వద్ద చారిత్రత్మక కాళేశ్వర, ముక్తీశ్వరాలయం ఉంది. ముక్తీశ్వరాల‌యం కార‌ణంగానే మిగ‌తా చోట్ల కంటే ఇక్కడికే భ‌క్తజ‌నం పోటెత్తనున్నార‌ని అధికారులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం పుష్కర‌ఘాట్‌కు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు రోజూ ల‌క్షన్నర భ‌క్తుల కంటే మించి హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో భ‌క్తులు వ‌స్తే సౌక‌ర్యాల లేమితో ఇబ్బందులు త‌ప్పవ‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాళేశ్వరం వద్ద ఇరుకుగా ఉన్న వీఐపీ పుష్కర ఘాట్‌ను విస్తర‌ణ చేయాల్సి ఉంటుద‌ని అధికారులు ప్రతిపాద‌న‌ల్లో కూడా పేర్కొన్నారు. అయితే నిధుల లేమితో ఈ ప‌నులు చేప‌ట్టలేక‌పోయారు. తాత్కాలిక మ‌రుగుదొడ్ల సంఖ్య, బ‌ట్టలు మార్చుకునే గ‌దుల సంఖ్య కూడా భ‌క్తుల సంఖ్య అంచ‌నాల‌న‌కు అనుగుణంగా లేవు. ఇక కాళేశ్వరంను అనుసంధానం చేస్తున్న ర‌హ‌దారుల్లో అనేక మ‌ర‌మ్మతులు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ప‌ట్టించుకోలేదు.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed