జొన్నలు కొనలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం

by Batti.Sumithra |

రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.

జొన్నలు కొనలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం
X

దిశ, మెదక్ ప్రతినిధి : రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రామాయంపేట మండల పరిధిలో పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి మంగళవారం మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం, స్థానిక ఎమ్మెల్యేల పై వ్యతిరేక నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా రైతులను రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మరోవైపు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రామాయంపేటలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన జొన్నలను తిరిగి పంపించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ జొన్నల విక్రయాల కోసం ఇంకా పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్నల కొనుగోలు ప్రారంభించే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, సుప్రభాత్ రావు, అహ్మద్, రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే..

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. రైతులు పండించిన జొన్నలను పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రిని కోరారు. దీని పై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, మంత్రి హామీ ఇచ్చినప్పటికీ స్థానిక మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చి, వెంటనే జొన్నల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story