ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి

by Ratna Kumari |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత బాధ్యతగా నిర్వహించి, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు.

ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, భీమదేవరపల్లి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత బాధ్యతగా నిర్వహించి, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంటింటి సర్వే పురోగతిని సమీక్షించిన ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హుడి ఓటు నమోదు కావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్ల పేర్లు తొలగింపునకు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 61 వేల తటస్థ ఓట్లు ఉండగా, భీమదేవరపల్లి మండలంలోనే 11 వేల తటస్థ ఓట్లు ఉండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. రానున్న పది రోజుల పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించి, అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. భీమదేవరపల్లి మండలంలోనే దాదాపు ఆరు వేల రేషన్ కార్డులు మంజూరు చేశామని, గత పదేళ్లలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందని అనేక కుటుంబాలకు ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, మరో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ధర్మారం గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామానికి ఎస్‌డీఎఫ్ నిధుల కింద రూ.7 లక్షలు, ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రధాన రహదారి అభివృద్ధికి కూడా అదనపు నిధులు తీసుకువచ్చి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story