భారీ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు: రూ.55 కోట్ల విలువైన 37 కేజీల గోల్డ్ సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-30 11:20:01  IST  )

అస్సాం పోలీస్ చరిత్రలోనే భారీ గోల్డ్ సీజ్ సంచలనం సృష్టిస్తోంది.

భారీ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు: రూ.55 కోట్ల విలువైన 37 కేజీల గోల్డ్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా గోల్డ్ స్మగ్లింగ్‌ (Gold Smuggling)కు సంబంధించి అస్సాం పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. గౌహతి సిటీ పోలీసులు నగరంలోని ఖార్ఘులి (Kharghuli) ప్రాంతంలో నిర్వహించిన ఓ స్పెషల్ రెయిడ్‌లో సుమారు 37 కేజీల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ శాంభవి మిశ్రా (DCP Shambhavi Mishra) వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.55 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గౌహతి సిటీ పరిధిలో భారీగా బంగారం స్మగ్లింగ్ జరుగుతోందనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఖార్ఘులి ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. ఈ తనిఖీల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు (Gold bars) లభ్యమయ్యాయి. వాటితో పాటు సుమారు 13 గ్రాముల బరువున్న వెండి రేకులు, ముక్కలను గౌహతి సిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్..

అయితే, ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతానికి చెందిన అక్షయ్ బన్సోడే (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికర వివరాలను డీసీపీ వెల్లడించారు. నిందితుడు అక్షయ్‌ను కేవలం ఈ స్మగ్లింగ్ రవాణా కోసమే ప్రత్యేకంగా ఒక ముఠా నెలకు రూ.80 వేల జీతానికి నియమించుకుందని తెలిపారు. నిందితుడు ఇప్పటి వరకు 3 సార్లు విజయవంతంగా దాదాపు 20 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడని, నాలుగోసారి ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కాడని తెలిపారు. అదేవిధంగా అస్సాం పోలీసుల చరిత్రలోనే ఇది బహుశా అతిపెద్ద గోల్డ్ సీజర్ కావచ్చని.. కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్‌తో మిడిల్ ఈస్ట్ దేశాలు, మయన్మార్‌తో పాటు భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో లింకులు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించామని డీసీపీ శాంభవి మిశ్రా పేర్కొన్నారు.

Next Story